వినాయక్‌నగర్, ఫిబ్రవరి 12: చోరీ కేసులో అనుమానితుడిగా కస్టడీలోకి తీసుకున్న ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సదరు వ్యక్తిని దవాఖానలో చేర్పించిన తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం అందించగా.. విచారణ పేరుతో తనభర్తను వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యకు యత్నించాడని భార్య ఆరోపించింది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల తెలిపిన ప్రకారం.. నిజామాబాద్ నగరానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడి వద్ద రాజు, లక్ష్మి దంపతులు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు.
వీరు రెండురోజుల క్రితం మోస్రాలోని వారి బంధువుల ఇంట్లో పెండ్లికి వెళ్లి వచ్చారు. అయితే అక్కడ చోరీ జరిగిందని, ఈ దొంగతనం రాజు చేశాడని అనుమానం వ్యక్తం చేస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ముగ్గురు వ్యక్తులు రాజు ఇంటికి మఫ్టీలో వచ్చి రాజును బలవంతంగా తీసుకెళ్తుండగా అడ్డువచ్చిన భార్య, బావమరిదిపై చేయిచేసుకొని వాహనంలో ఎక్కించుకొని పోయారు.
దీంతో భార్య లక్ష్మి, కుటుంబీకులు నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లతోపాటు బోధన్ పోలీసుస్టేషన్‌కు వెళ్లినా రాజు ఆచూకీ లభించలేదు. చివరికి నగరంలోని నాల్గోటౌన్ పక్కన ఉన్న మరో స్టేషన్లో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి ఆరా తీశారు. ‘మీ భర్త మా వద్ద ఉన్నాడని, విచారిస్తున్నామని, విచారణ పూర్తయ్యాక పంపుతామని’ చెప్పడంతో వారు ఇంటికి తిరిగివచ్చారు.
రాజు జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ రావడంతో భార్య లక్ష్మి హుటాహుటిన అక్కడికి చేరుకున్నది. పోలీసులు వేధించడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడని వాపోయింది. నిజంగా చోరీ చేసి ఉంటే కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పర్చాల్సిన బోధన్ పోలీసులు.. రాజును తాము కస్టడీలోకి తీసుకోలేదని, తమకు తెలియదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తున్నది.