Celina Jaitley | బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ కుటుంబానికి సంబంధించిన ఓ సంఘటన ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఆమె సోదరుడు, భారత సైన్యంలో పారా స్పెషల్ ఫోర్సెస్‌లో సేవలందించి రిటైర్ అయిన మేజర్ విక్రాంత్ జైట్లీ, గత కొన్ని నెలలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్బంధంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తన సోదరుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని సెలీనా భావోద్వేగంగా కోరుతున్నారు. సమాచారం ప్రకారం, 2024 సెప్టెంబర్‌లో దుబాయ్‌లోని ఓ షాపింగ్ మాల్ వద్ద విక్రాంత్‌ను స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆయన ఉన్న స్థలం కుటుంబానికి స్పష్టంగా తెలియకపోవడంతో ఆందోళన నెలకొంది.
ప్రస్తుతం ఆయన అబుదాబిలోని అల్-వత్బా డిటెన్షన్ సెంటర్లో ఉన్నట్లు సమాచారం. అధికారికంగా ఆయనపై “జాతీయ భద్రత”కు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని మాత్రమే వెల్లడించగా, పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఈ వ్యవహారంపై కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో, ఢిల్లీ హైకోర్టు విదేశాంగ మంత్రిత్వ శాఖకు కీలక సూచనలు చేసింది. విక్రాంత్ తరఫున న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక న్యాయ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతర్జాతీయ న్యాయ నిబంధనల ప్రకారం ఒక భారతీయ పౌరుడికి లభించాల్సిన సహాయాన్ని తక్షణం అందించాలని కోర్టు స్పష్టం చేసింది. గతంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా తిరిగి తీసుకువచ్చిన సందర్భాలను గుర్తు చేస్తూ, అదే విధంగా ఈ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని సెలీనా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యవహారం కారణంగా కుటుంబం ఆర్థికంగా, వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆమె తెలిపారు.
సెలీనా చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. పలువురు అభిమానులు, సామాజిక వర్గాల నాయకులు ఆమెకు మద్దతు తెలుపుతూ విక్రాంత్ త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తున్నారు. అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళన వ్యక్తమవుతోంది.