Superstar Rajinikanth | తన నిజాయితీతో అందరి మనసు గెలుచుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను సూపర్ స్టార్ రజనీకాంత్ సత్కరించడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ కావడమే కాకుండా పెద్ద వివాదానికి దారితీసింది. చెన్నైలోని టి. నగర్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు ఇటీవల విధుల్లో ఉండగా 45 తులాల బంగారం ఉన్న ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్‌ను చూసిన ఆమె ఏమాత్రం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, ఫిబ్రవరి 3న ఆమెను తన నివాసానికి ఆహ్వానించి, శాలువాతో సత్కరించి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడు.
అయితే రజనీకాంత్ చేసిన ఈ పనిని నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. ‘మెర్కు తోడర్చి మలై’ సినిమాతో అవార్డు అందుకున్న దర్శకుడు లెనిన్ భారతి మాత్రం దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయన రజనీకాంత్‌తో పాటు పద్మను సన్మానించిన వారిని ఉద్దేశించి స్పందిస్తూ.. కొద్ది రోజుల క్రితం పారిశుద్ధ్య కార్మికులు తమ కనీస హక్కుల కోసం, జీతాల కోసం రిప్పన్ బిల్డింగ్ (చెన్నై కార్పొరేషన్) ముందు భారీ ఎత్తున నిరసనలు చేసినప్పుడు ఈ గొప్ప మనసున్న వారంత ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించాడు.
అలాగే రజనీకాంత్ సన్మానించే సమయంలో కూడా ఆ కార్మికురాలిని పని డ్రస్సులోనే ఉంచి ఫోటోలు దిగడాన్ని ఆయన విమర్శించారు. ఆమెను ఒక వ్యక్తిగా కాకుండా, కేవలం ఒక ‘సేవకురాలు’ అనే ముద్రతోనే చూపిస్తున్నారని, ఇది ఒక రకమైన సామాజిక వివక్ష అని లెనిన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వివాదంపై రజనీకాంత్ అభిమానులు మండిపడుతున్నారు. పద్మ చేసిన మంచి పనిని గుర్తించడం తప్పా? అని వారు ప్రశ్నిస్తుండగా, లెనిన్ భారతి మద్దతుదారులు మాత్రం కార్మికుల కష్టాలపై సెలబ్రిటీల మౌనాన్ని ప్రశ్నించడం సరైనదేనని అంటున్నారు.