నిజామాబాద్, నవంబర్ 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఏసీబీ దాడులు తీవ్ర కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ శాఖలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్ట్రార్ అక్రమాలపై కొరడా ఝులిపించింది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో బైపాస్ రోడ్డులోని ఓ నూతన అపార్ట్మెంట్లో సికింద్రాబాద్ మండల సర్వేయర్ కె.కిరణ్ కుమార్ నివాసంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండల సర్వేయర్‌గా కాలువ కిరణ్ కుమార్ పని చేస్తున్నాడు.
ఓ స్థిరాస్తికి సంబంధించిన విషయంలో అనుకూల నిర్ణయాన్ని వెలువరించేందుకు ఓ వ్యక్తి వద్ద రూ.3లక్షలు లంచం డిమాండ్ చేశాడు. రూ.1లక్ష నగదును సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో చైన్‌మెన్‌గా పని చేస్తున్న మేకల భాస్కర్ ద్వారా పుచ్చుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా హైదరాబాద్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇరువురిని నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇందులో ప్రధాన నిందితుడైన కాలువ కిరణ్ కుమార్‌కు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది.
వ్యవసాయ భూములు, పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నట్లుగా నిర్ధారణకు రావడంతో నిజామాబాద్‌లోనూ దాడులు నిర్వహించింది. బైపాస్ రోడ్డులో ఏడాదిన్నర క్రితమే రూ.70లక్షలతో కొనుగోలు చేసిన ఓ ప్లాట్‌లో కిరణ్ కుమార్ నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఏసీబీ అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రూ.లక్ష లంచం తీసుకున్న సర్వేయర్, చైన్మెన్లు ఇరువురు అయ్యప్ప మాలాధారణలో ఉన్నారు. పవిత్రమైన మాలాధారణను ధరించి నీచమైన పనికి ఒడిగట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.