వినాయక్‌నగర్, జూన్ 9 : హైదరాబాద్‌లో ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్‌నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ తండాకు చెందిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణ నేపథ్యంలో మోహన్‌నాయక్ ఇంటితోపాటు 15 ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇండ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్‌తో పాటు ఆయన స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం సుమారు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆయన స్వగ్రామమైన కులాస్పూర్ తండా శివారు, గంగస్థాన్ ప్రాంతంలోని మోహన్‌నాయక్ బంధువుల ఇంటితో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం ఆయన సంబంధీకుల వద్ద మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
మోహన్‌నాయక్‌కు సంబంధించి కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న సంస్కృతి గేటెడ్ కమ్యూనిటీలో ఓ విల్లా సైతం నిర్మాణంలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటికే ఆయనకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయట పడినట్లు తెలిసింది.
డిచ్పల్లి మండలం ముల్లంగి, హైదరాబాద్‌లోని కొంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల నుంచి ఆస్తులతో పాటు ఆయన ఇంట్లో నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సదరు అధికారిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.