ACB Raids | వినాయక నగర్, జూన్ 9 : ఆర్ అండ్‌బీ ఈఎస్సీ (రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడ పెట్టాడని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం నుండి దాడులు చేపట్టి సోదాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనపై వచ్చిన పలు ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాలలో ఆయన ఇళ్లతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఈరోజు ఉదయం నుండి సుమారు 15 ఏసీబీ బృందాలు వేర్వేరు ప్రాంతాలలో దాడులు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ శివారులోని గంగస్థాన్ ప్రాంతంలో గల ఆర్ అండ్‌బీ ఈఎస్సీ మోహన్ నాయక్ బంధువుల ఇంటితోపాటు ఇతర ప్రాంతాలలో సైతం ఆయన సంబంధీకుల వద్ద విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే ఆయనకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఏసీబీ అధికారుల తనిఖీల్లో బయటపడినట్లు తెలిసింది. ఆయనకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల పూర్తి వివరాలను సాయంత్రం వరకు అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెల్లడించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.