ACB Raids | వినాయక్ నగర్, సెప్టెంబర్ 21 : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి తన పనుల కోసం అనుమతి కోరగా సదరు విభాగంలోని అధికారి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని రెండో అంతస్తులు గల ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్ రూ.15 వేలు బాధితుడి వద్ద నుండి లంచం తీసుకోవడంతో నిజామాబాద్ ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అతనితోపాటు అదే విభాగంలో ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్‌ను సైతం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ద్వారా పూర్తి వివరాలు రికార్డు చేస్తున్నట్లు ఏసీబీ అధికారుల ద్వారా తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.