వినాయక్‌నగర్, మార్చి 12 : నిజామాబాద్ రవాణా కార్యాలయం దళారులకు అడ్డాగా మారింది. వారు చెప్పిందే అక్కడి సిబ్బంది పాటించడం పరిపాటిగా మారింది. డబ్బులిచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తూ పనులు చేసి పెడుతున్నారు. ఆర్టీఏ సిబ్బంది సహకారంతో దళారులు రెచ్చిపోతుండడం, నేరుగా వచ్చిన వారి పనులు పూర్తికాకపోవడంతో విసిగివేసారిపోయిన కొందరు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్టీఏ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారుల దాడి కలకలం సృష్టించింది. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది నాగారం పరిధిలో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ఉదయం 11 గంటల ప్రాంతంలో చుట్టుముట్టారు. కార్యాలయం లోపల, వెలుపల ఉన్న సిబ్బందితోపాటు ప్రైవేటు వ్యక్తులను ఎక్కడికక్కడే కట్టడి చేశారు. లోపల నుంచి బయటికి, బయటి నుంచి లోపలకు ఎవరినీ వెళ్లకుండా నిలువరించి, ప్రధాన గేట్‌కు తాళం వేసి విస్తృతంగా సోదాలు చేపట్టారు.
సోదాల్లో ఎండీ ఖలీల్ అనే ఏజెంట్ నుంచి రూ.27 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. 14 వివిధ వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు రాత్రి 10 గంటల వరకు ఏకధాటిగా కొనసాగాయని, కార్యాలయంలో లభించిన పత్రాలతోపాటు రికార్డుల వివరాలను సైతం తమ రిపోర్టులో నమోదు చేసుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ తెలిపారు.
రవాణా శాఖ కార్యాలయంలో ఏమైనా పనులు జరగాలంటే ఇక్కడ అధికారులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు తమకు అనుకూలంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు సమాచారం. కార్యాలయంలో వాహనాలకు సంబంధించిన ఎలాంటి పనులు జరగాలన్నా ఆ పనిని బట్టి ఒక కోడ్ ద్వారా డబ్బులు వసూలు చేయడం గమనార్హం. దళారులు ఆర్టీవో కార్యాలయంలో ఉద్యోగి మాదిరిగా కలియదిరుగుతూ ప్రత్యేక కోడ్‌ను వాహనాల పత్రాలపై రాసి, దాని ద్వారా వసూళ్లులకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారుల సోదాలో బహిర్గతమైంది. తనిఖీల సందర్భంగా తమ దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి అందజేసే నివేదికలో పొందుపర్చనున్నట్లు ఏసీబీ అధికారి వెల్లడించారు.
కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమయంలో నిజామాబాద్ డీటీవో దుర్గాప్రమీల అందుబాటులో లేరని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆమె మొబైల్ సైతం స్విచ్ఛాఫ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఆమె సెలవులో ఉన్నట్లు రికార్డులోకూడా లేదని తెలిపారు.