Bone Cancer | కంటేశ్వర్, ఫిబ్రవరి 17: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామవాసి సుంకరి నరసయ్య, లక్ష్మి రెండో కుమారుడు సుంకరి హరీష్ బోన్ క్యాన్సర్ వ్యాధి బారీన పడ్డాడు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. కొన్నేండ్ల క్రితం బతుకు తెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లిన హరీష్ తీవ్ర అనారోగ్యంతో ఇంటికి చేరుకున్నాడు.
ఇంటికొచ్చాక దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకుంటే బోన్ క్యాన్సర్ అని తేలింది. ఉన్న ఆస్తులు అమ్ముకుని చికిత్స చేయించుకున్నా వ్యాధి నయం కావడం లేదు. తదుపరి వైద్య ఖర్చుల నిమిత్తం అధిక మొత్తంలో ఖర్చు అవుతుండడంతో జీవితంపై ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. బంధువులు, స్నేహితులు కొంతమంది చేయూతనిచ్చినప్పటికీ వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అని, దాతలు సహకరించి తనను బ్రతికించాలని వేడుకుంటున్నాడు.
హరీష్ తండ్రి సుంకరి నరసయ్య మాట్లాడుతూ తన కుమారుడు దవాఖాన వైద్య ఖర్చులకు ఉన్న ఆస్తులు అమ్మి ఇప్పటికే దాదాపు రూ.80 లక్షలు ఖర్చు చేశామని చెప్పాడు. ఇకపై వైద్య ఖర్చు భరించే స్తోమత తమకు లేదని, ప్రభుత్వం తమ కుమారుడ్ని ఆదుకోవాలని వేడుకున్నాడు.
సోమవారం తమ గ్రామ యువకుడికి యువతరం యూత్ తరుపున రూ.30,000 చేయూత అందించారు. యువతరం యూత్ అద్యక్షులు మహేందర్ మాట్లాడుతూ రూ. లక్షలు ఖర్చుచేసినా ఆరోగ్యం కుదుట పడ లేదన్నారు. పూర్తిగా చికిత్స అందించేందుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం తమ గ్రామ యువకుడిని ఆదుకుని వైద్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దాతలు సహకరించి హరీష్‌ను 9381384011 ఫోన్ నంబర్లో సంప్రదించి సహాయం చేయాలని కోరారు.