వేల్పూర్, డిసెబంర్ 6 : మండంలోని అంక్సాపూర్ లో ప్రియుడు, తండ్రితో కలిసి భర్తను హత్య చేయించి వ్యవసాయ భూమిలో పాతిపెట్టిన సంఘటన వెలుగు చూసింది. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు మంగళవారం వేల్పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన జమునను భర్త రంజిత్ (33) మద్యం మత్తులో నిత్యం హింసించేవాడు. దీంతో పాటు జమునకు నాగేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో జమున భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని తండ్రి గంగా రాం, నాగేష్, మరొకరితో కలిసి పథకం పన్నింది. అక్టోబర్ 20 తేదీన వేల్పూర్ ఎక్స్‌రోడ్డు సమీపంలో నాగేష్ కౌలుకు చేస్తున్న వ్యవసాయ తోటలోకి రంజిత్ తాగిన మైకంలో రాగానే కర్రలతో తలపై కొట్టారు. దీంతో రంజిత్ అక్కడిక్కడే మృతి చెందాడు.
మృతదేహాన్ని ఆ తోటలో మామిడి చెట్టుకింద పూడ్చి పెట్టి ఎవరికీ అనుమానం కలుగకుండా గడ్డి కుప్పలను వేశారు. తన భర్త చిన్న గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని జమున అక్టోబర్ 24న వేల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ క్రమంలో పోలీసులు మృతుడి కాల్‌డేటా, జమున కాల్‌డేటా పరిశీలించడంతో నాగేష్‌పై అనుమానం కలిగింది. నాగేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో రంజిత్‌ను జమున పథకం ప్రకారం గంగారాం, మరొకరితో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. దీంతో మామిడి చెట్టు కింది పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించామన్నారు. నిందితులు జమున, గంగారాం, నాగేష్తో పాటు మరొకరిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించిన నట్లు ఏసీపీ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై వినయ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.