భీమ్గల్, జూన్ 5: భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణక్షేత్రం లింబాద్రి గుట్ట సమీపంలో శుక్రవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఆడుకుంటూ వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఒడ్డెర కాలనీకి చెందిన ద్యారంగుల సురేశ్ కుమారుడు అరవింద్(4), కంది మహేశ్ కూతురు వర్షిణి(5), కుమారుడు హరీశ్ (10) శుక్రవారం ఉదయం ఆడుకుంటూ సమీపంలోని బ్రాహ్మణ కుంట వద్దకు వెళ్లారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.
దీంతో సురేశ్ పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసు లు పరిసరాలలో గాలించినా లాభం లేకపోయింది. చివరకు ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లను పిలిపించి బ్రాహ్మణ కుంట లో వెతుకగా ముగ్గురి మృతదేహాలు వెలుగు చూసాయి. చిన్నారులు ఆడుకుంటూ స్నానానికి దిగి ఈత రాక మృతి చెందినట్లు భావిస్తున్నారు. ముగ్గురి మృతితో కుటుంబ సభ్యు లు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేపట్టారు.