డిచ్పల్లి, జూన్ 13 : రాష్ట్రం పేరుమీద ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీలో ఆది నుంచి పాలనలో నిర్ల క్ష్యం రాజ్యమేలుతున్నది. తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి 18 సంవత్సరాలు అవుతుండగా..ఇప్పటివరకు ఒకేసారి స్నాతకోత్సవం (కాన్వకేషన్) నిర్వహించారు. వర్సిటీలో నిర్వహించే అతి పెద్ద పండుగ స్నాతకోత్సవం. పీజీలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించి ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయంలో ఏడాదికోసారి స్నాతకోత్సవం చేపట్టాలని యూజీసీ చెబుతోంది. కానీ తెలంగాణ యూనివర్సిటీలో ఈ 18 ఏండ్లలో ఒకసారి మాత్రమే నిర్వహించడం దురదృష్టకరం. నాలుగు నెలల క్రితం వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య టి.యాదగిరిరావు స్నాతకోత్సవం నిర్వహణకు తొలి ప్రాధాన్యమిస్తూ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గతేడాది నవంబర్‌లో జారీ చేయించారు.
పీజీ, పీహెచ్‌డీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసేందుకు పదేండ్ల క్రితం అప్పటి వర్సిటీ అధికారులు దాతలను సంప్రదించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ హోదాల్లోని ప్రముఖులు, విద్యాసంస్థల అధిపతులు, స్వచ్ఛంద సేవకులు, రాజకీయ నేతలు ఆయా రంగాల్లోని వారు ముందుకొచ్చి రూ.33.80 లక్షలు విరాళంగా ఇవ్వగా వర్సిటీ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఈ నగదుకు వడ్డీ రూపంలో వచ్చిన సొమ్ముతో వివిధ కోర్సుల్లో ప్రతిభ చాటిన 131 మందికి పతకాలు అందించేందుకు ఉన్నతాధికారులు వాటిని తయారు చేయించడంలో నిమగ్నమయ్యారు. అన్ని అనుకున్నట్లు జరిగితే జూలై మూడోవారంలో స్నాతకోత్సవం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావు ఇటీవల రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను స్వయంగా కలిసి స్నాతకోత్సవానికి రావాలని ఆహ్వానించారు.
తెలంగాణ యూనివర్సిటీ 2006లో ఏర్పడగా తొలి స్నాతకోత్సవం 2013 నవంబర్ 13 లో అప్పటి వీసీ ఆచార్య అక్బర్‌అలీఖాన్ హయాంలో నిర్వహించారు. ఆ తర్వాత స్నాతకోత్సవం ఊసే లేదు. అనంతరం 2018లో అప్పటి వీసీ ఆచార్య సాంబయ్య, మళ్లీ 2020లో ఆనాటి వీసీ రవీందర్‌గుప్తా నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ ఈ రెండుసార్లూ అమలుకు నోచుకోలేదు.
వర్సిటీ ఏర్పాటైన నుంచి ఒకేసారి స్నాతకోత్సవం నిర్వహించినట్లు నేను బాధ్యతలు స్వీకరించిన త ర్వాత తెలిసింది. తొలి ప్రాధాన్య అంశాల్లో స్నాతకోత్సవం నిర్వహించడం ఒకటిగా పెట్టుకున్నాం. విద్యార్థులు, అధ్యాపకులను ప్రోత్సహించేందుకు స్నాతకోత్సవాన్ని పెద్దపండుగలా నిర్వహిస్తాం. గవర్నర్ అనుమతితో బంగారు పతకాలు తయారుచేయిస్తున్నాం. స్నాతకోత్సవం జూలై మూడోవారంలో నిర్వహించనున్నాం. ముఖ్యఅతిథిగా రావాలని గత సోమవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను స్వయంగా కలిసి ఆహ్వానించాం. మిగతా అతిథుల వివరాలను త్వరలో తెలియజేస్తాం.