వేల్పూర్, మే 10: బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెలరోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. మూడు రోజులుగా నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించానని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడానికి నేడు (సోమవారం) రైతు నిరసన, ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.
ఆదివారం ఆయన వేల్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించి కేంద్రాలు తెరిచే సరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని ఆరోపించారు. మద్దతు ధర రూ.2,390 ఉండగా ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యక్తులకు రూ.1,750 నుంచి రూ. 1900లకే అమ్ముకుంటున్నారని, దీంతో ఎకరాకు సుమారు రూ.15వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్‌మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాలుకు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు.
ఫోన్ ఎత్తని కలెక్టర్..
రైతుల సమస్యలపై మాట్లాడేందుకు కలెక్టర్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడంలేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలసీలో భాగమేనని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, రవాణాకు లారీలను పెంచాలని, గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని, తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలని, దొడ్డు రకానికి గ్రేడ్ -1 రేటుతో పాటు రూ.500 బోనస్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు మోర్తాడ్ మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, దొన్కంటి నర్సయ్య, ఏలియా, పూర్ణానందం, నర్సారెడ్డి, దేవేందర్, రాజాగౌడ్, రేగుల్ల రాములు, డొల్ల రాజేశ్వర్ పాల్గొన్నారు.