కామారెడ్డి, ఏప్రిల్ 2: రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగి ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌కు బీఆర్ఎస్ నేతలు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ మద్దతు ధర కన్నా క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారని, అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు, రైతులకు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడని అన్నారు. ప్రభు త్వం మొండిగా వ్యవహరిస్తే ఈ నెల 6న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక రోజు దీక్ష చేస్తామని, కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నా చేసి రైతులకు అండగా ఉంటామని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.