Bear | ఎల్లారెడ్డి రూరల్ : ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని గుట్టపై ఎలుగుబంటి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. కళ్యాణి గ్రామానికి చెందిన మియా జానీ ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ రామలింగం బావి పరిసరాలలోని మిషన్ భగీరథ నీటి ట్యాంక్ సమీపంలో తునికాకు కోసం వెళ్లినట్లు తెలిపారు. తునికాకు కోస్తున్న సమయంలో ఎలుగుబంటి పుట్టను తవ్వుతున్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.
ఎలుగుబంటి కనిపించడంతో తునికాకు సేకరణ వదిలేసి గ్రామానికి చేరుకున్నట్లు తెలిపారు. గుట్టపై ఎలుగుబంటి కనిపించిన విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. తునికాకు సేకరణకు వెళ్లినవారు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.