ఉమ్మడి జిల్లాలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కలెక్టరేట్‌తోపాటు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ నేతల విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్.నిరంజన్, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా తెలంగాణ వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం వారు జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. పలు శకటాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు వినయ్‌కృష్ణారెడ్డి, ఆశీష్ సంగ్వాన్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
– కామారెడ్డి/ కంఠేశ్వర్, ఆగస్టు 15
బాల్కొండ మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగానే నేడు స్వేచ్ఛ స్వాతంత్య్రం అనుభవిస్తున్నామని అన్నారు. గాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో దేశ ప్రజలందరూ ఒక్కటై పోరాటం చేయడంతో మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు.
అదే స్ఫూర్తితో ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు. ప్రపంచంలో భారతదేశం ఇప్పుడు శక్తివంతమైన దేశమని, తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధిలో దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. మనమందరం కలిసికట్టుగా దేశాభివృద్ధికి కార్యోన్ముఖులై పని చేయాలని పిలుపునిచ్చారు.