కామారెడ్డి, అక్టోబర్ 25 : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన సుమారు 600 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్, బీజేపీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి సమక్షంలో బుధవారం గులాబీ కండువాలు కప్పుకున్నారు. దోమకొండ మండలంలోని సంగమేశ్వర్, సీతారాంపల్లి, అంబారీపేట్, బీబీపేట్ మండలం ఉప్పర్పల్లితోపాటు జిల్లా కేంద్రంలోని 2వ వార్డు (రామేశ్వరపల్లి), 23వ వార్డుకు చెందినవారు బీఆర్ఎస్లో చేరగా.. జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ ఇందుకు వేదిక అయ్యింది.
చేరికల సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఎక్కడాలేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు. తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనే నాణ్యమైన కరెంట్ ఇవ్వడంలేని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారం కోసమే ఆరు గ్యారంటీల పేరిట మభ్యపెడుతున్నదని, 60 ఏండ్లు పాలించినప్పుడు చేయనోళ్లు ఇప్పుడేం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని గుర్తుచేశారు. మరింత అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు. అందరం కలిసి ఒక్క ఓటు కూడా పోకుండా కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిందని, కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే ఆదర్శ నియోజకవర్గంగా నిలుస్తుందని అన్నారు. అన్ని వర్గాలవారికి సమన్యాయం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
ఆయా గ్రామాల ప్రజలు బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తీర్మానం చేసిన కాపీలను విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు, దోమకొండ జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.