డెంగీ పంజా విసురుతున్నది. ఉభయ జిల్లాల్లో మహమ్మారి ప్రబలుతున్నది. దీనికి తోడు విష జ్వరాల వ్యాప్తి కొనసాగుతున్నది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు, డెంగీ విస్తరిస్తుండడం కలకలం రేపుతున్నది. నిజామాబాద్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారమే 582 డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నది. అనధికారంగా వేలాది మంది బాధితులు ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోనూ డెంగీ వ్యాప్తి తరచూ వెలుగు చూస్తూనే ఉన్నది. గత ఆగస్టు నుంచి అక్టోబర్ 9 వరకు సుమారు 150 కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
-ఖలీల్‌వాడి, అక్టోబర్ 9
ఉమ్మడి జిల్లాలో విష జ్వరాల వ్యాప్తి కొనసాగుతున్నది. రకరకాల అనారోగ్య సమస్యలతో జనం బాధ పడుతున్నారు. వాతావరణ మార్పులతో పాటు మారుతున్న వైరస్ రూపాంతరాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా జ్వరం, ఒళ్ల నొప్పులతో సతమతమవుతున్నారు. ఆర్నెళ్లయినా నొప్పులు తగ్గడం లేదని వాపోతున్నారు. ఎంతకీ జ్వరం, నొప్పులు తగ్గక పోవడంతో దవాఖానలకు క్యూ కడుతున్నారు. నిజామాబాద్ దవాఖానలో 20 మందికి పైగానే డెంగీ బాధితులు చికిత్స పొందుతున్నారు.
రోగుల అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ దవాఖానలు సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర వ్యాధుల పేరిట అనేక వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. స్కానింగ్, ఎంఆర్ఐ అంటూ అవసరం లేని టెస్టులు చేయిస్తున్నారని రోగులు వాపోతున్నారు. అంతేకాదు, వారం, పది రోజుల పాటు దవాఖానలో ఉంచుకుని, కేవలం స్లైన్లు పెడుతూ భారీగా పిండుకుంటున్నారని చెబుతున్నారు.
వాస్తవానికి డెంగీ వైరస్‌ను గుర్తించే ఎలిసా టెస్ట్ కేవలం ప్రభుత్వ దవాఖానాల్లోనే చేయాల్సి ఉండగా, కొందరు వైద్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీ, ప్రభుత్వ దవాఖానల్లో పని చేసే డాక్టర్లు కొందరు ప్రైవేట్‌గా క్లినిక్‌లు నడుపుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు ఉన్నప్పటికీ, రోగులను తమ క్లినిక్‌లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు, సాధారణ జ్వరాలను డెంగీగా పేర్కొంటూ, ప్లేట్లెట్స్ పడిపోయాయని, పరిస్థితి సీరియస్ అని చెప్పి పెద్ద మొత్తంలో రోగుల నుంచి వసూలు చేస్తున్నారు.
అపరిశుభ్రత, దోమల వ్యాప్తితోనే డెంగీ, ఇతర జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు సుందరంగా మారాయి. పట్టణాల్లోనూ పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. అయితే, ప్రభుత్వం మారాక, పల్లెలు, పట్టణాలకు నిధులు రాక పరిస్థితి మారిపోయింది. దీంతో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తున్నది. దోమలు విజృంభిస్తుండడంతో విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రై డే మొక్కుబడిగా మారింది.
అత్యధికంగా డెంగీ కేసులు నమోదైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. డెంగీని గుర్తించే వైద్య పరీక్షలు జీజీహెచ్ ఆవరణలోని టీ-హబ్‌లో మాత్రమే చేస్తారు. ప్రైవేట్‌లో చేయకూడదు. ఈ విషయమై ఇప్పటికే డయాగ్నస్టిక్ సెంటర్లకు, ప్రైవేట్ దవాఖానలకు సర్క్యూలర్ జారీ చేశాం.
– రాజశ్రీ, డీఎంహెచ్‌వో, నిజామాబాద్
జీజీహెచ్‌కు రోగుల తాకిడి పెరిగింది. రద్దీ దృష్ట్యా ఫీవర్ వార్డు ఏర్పాటు చేశాం. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమిక్షిస్తున్నాం.
-ప్రతిమరాజ్, జీజీహెచ్ సూపరింటెండెంట్
డిచ్పల్లి, అక్టోబర్ 9: డెంగీతో బాధ పడుతూ ఓ యువకుడు మృతి చెందాడని డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామస్తులు తెలిపారు. వివరాలు.. రాంపూర్ గ్రామానికి చెందిన వెంకనోళ్ల లత, రాజేందర్ దంపతుల కుమారుడు వెంకనోళ్ల ఓంకార్ (22) హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల జ్వరం రావడంతో స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం నిజామాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ రక్త పరీక్షలు చేయగా, ప్లేట్లెట్స్ తగ్గాయని తేలడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అదేరోజు రాత్రి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. డిగ్రీ చదువుకుంటూనే ఆర్మీలో ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఓంకార్ ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.