కామారెడ్డి, ఫిబ్రవరి 25 : పండుగలు వచ్చాయంటే చాలు ఆర్టీసీ ప్రత్యేక చార్జీల పేరిట మోత మోగిస్తున్నది. అదనపు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నది. కామారెడ్డి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు అదనపు బస్సులను నడుపుతూ అదనపు చార్జీలను వసూలు చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆర్టీసీకి మేలు చేస్తున్నట్లుగా వ్యవహరించి, ఇప్పుడు పండుగ పేరిట అదనపు చార్జీలను వసూలు చేస్తున్నది. శివరాత్రి పర్వదినాన భక్తులు ఆయా శివాలయాలు ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. దీనిని అదునుగా చేసుకొని ప్రభుత్వం ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నది.
కామారెడ్డి నుంచి వేములవాడకు పల్లెవెలుగు రెగ్యులర్గా 14 బస్సులు ఉండగా అదనంగా 10 బస్సులను నడుపుతున్నారు. బస్సు చార్జి రూ.80 ఉండగా, ప్రత్యేక బస్సులకు 120 రూపాయలు వసూలు చేయనున్నారు. కామారెడ్డి నుంచి రామారెడ్డి మండలం మద్దికుంటకు ఒక బస్సు ఉండగా అదనంగా ఆరు బస్సులను నడుపనున్నారు. బస్సు టికెట్ రూ. 30ఉండగా ప్రత్యేక బస్సులకు రూ.45 రూపాయలు వసూలు చేయనున్నారు. కామారెడ్డి నుంచి తాడ్వాయి మండలం సంతాయిపేట్కు ఒక బస్సు ఉండగా అదనంగా ఆరు బస్సులను నడుపనున్నారు.
బస్సు టికెట్ రూ.30 ఉండగా ప్రత్యేక బస్సులకు 45 రూపాయలు వసూలు చేయనున్నారు. కామారెడ్డి నుంచి భిక్కనూర్కు 5 బస్సులు ఉండగా అదనంగా రెండు బస్సులు నడపనున్నారు. బస్సు టికెట్ 30 రూపాయలు ఉండగా ప్రత్యేక బస్సులకు 45 రూపాయలు వసూలు చేయనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో చాలా వరకు బస్సుల్లో మహిళల రద్దీ సంఖ్య పెరిగింది. ఇప్పుడు టికెట్ ధర అదనంగా చెల్లించినా సరిపడా బస్సులు లేక, సీట్లు దొరక్క ప్రయాణికులు నానా అవస్థలు పడే అవకాశాలు ఉన్నాయి.
మహా శివారాత్రి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం కామారెడ్డి నుంచి వేములవాడ, సంతాయిపేట్, మద్దికుంట, భిక్కనూర్కు 20 ప్రత్యేక బస్సులను నడపుతున్నాం. రెగ్యులర్గా నడిచే బస్సులతోపాటు ప్రత్యేక బస్సులను నడపనున్నాం. కేవలం ప్రత్యేక బస్సులో మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నం. రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని బస్సులను నడిపించడానికి ఏర్పాటు చేస్తున్నాం.
-ఇందిరా, డిపో మేనేజర్, కామారెడ్డి