అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 236 మంది అభ్యర్థులు 410 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం నిజామాబాద్‌లో గణేశ్ గుప్తా, ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి, మద్నూర్‌లో హన్మంత్ షిండే, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్ నామినేషన్లను సమర్పించారు.
ఖలీల్‌వాడి, నవంబర్ 10: బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, అర్బన్ అభ్యర్థి బిగాల చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అర్బన్, బోధన్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ అర్బన్ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో శుక్రవారం రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బిగాల చేసిన అభివృద్ధి పనులతోనే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు. జిల్లాలోని అభ్యర్థులందరూ విజయం సాధించి మూడోసారి చరిత్ర సృష్టించనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారని, మరోసారి సీఎం అయ్యి చరిత్ర సృష్టిస్తారన్నారు. ఆదరణ, ఆప్యాయత, ప్రేమతో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిజామాబాద్ నగరం గతంలో ఎలా ఉన్నది.. ప్రస్తుతం ఎలా ఉన్నదో చూడాలన్నారు. రౌడీయిజం, గుండాయిజం లేకుండా శాంతిభద్రతలతో ఉంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ 54ఏండ్లు పాలించి నిజామాబాద్‌కు ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ ఆరుసార్లు, కాంగ్రెస్‌కు ఎన్నోసార్లు అవకాశం వచ్చినా నిజామాబాద్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు.
నామినేషన్ వేసేందుకు ముందు అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా ఇంటికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. ఈ సందర్భంగా బిగాలకు వీరతిలకం దిద్ది విజయీభవ అంటూ దీవించారు. అనంతరం ఎమ్మెల్యే సెంటిమెంట్ అయిన గులాబీరంగు అంబాసిడర్ కారులో నామినేషన్ వేసేందుకు బయల్దేరారు. ఎమ్మెల్సీ కవిత కారును నడుపుతుంటే..పక్క సీటులో బిగాల కూర్చుకున్నారు. నామినేషన్ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
ఆర్మూర్‌టౌన్, నవంబర్10: ఈనెల 3న ప్రారంభమైన నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. చివరిరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి మరో సెట్ నామినేషన్‌ను వేశారు. వివిధ పార్టీ అభ్యర్థులు సైతం మరో సేట్ నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్‌కుమార్ తెలిపారు. వారం రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల పక్రియ పోలీసుల బందోస్తు మధ్య ప్రశాంతంగా ముగిసింది.