మోర్తాడ్/ నిజాంసాగర్, సెప్టెంబర్ 24: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు బుధవారం వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 2.54లక్షలు, నిజాంసాగర్‌కు 70,322 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ 40, నిజాంసాగర్ పది వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు(80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1070.84అడుగుల(58.973టీఎంసీల)నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 3,51,017క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ 40వరదగేట్లు ఎత్తి 3,35,160క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరదకాలువకు 6,214, కాకతీయకాలువకు 5,500, ఎస్కేప్గేట్ల ద్వారా 2,500, సరస్వతీకాలువకు 400, లక్ష్మీకాలువకు వంద, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్ భగీరథకు 231క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తుండగా.. 632 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తుంది.
నిజాంసాగర్ ప్రాజెక్టు పది వరద గేట్ల ద్వారా 69,322, ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల చొప్పున మొత్తం 70,322 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈఈలు అక్షయ్‌కుమార్, సాకేత్ తెలిపారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1402.08 అడుగుల (13.78 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నదన్నారు.