యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అందరికీ అన్నం పెట్టే రైతును హస్తం పార్టీ ఆగం జేసింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన ఘనత, చేతికొచ్చిన పంటలను ఎండబెట్టిన చరిత్ర హస్తం పార్టీదే. అరకొర విద్యుత్.. అది కూడా తెల్లందాకా ఇచ్చి, వేలాది రైతుల బతుకులను తెల్లారిపోయేలా చేసిన పాపం కాంగ్రెస్‌దే. తెలంగాణలో కటిక చీకట్లను నింపి రైతులను వలసల బాట పట్టించింది. కానీ, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టాక వ్యవసాయం మళ్లీ చిగురించింది. కాంగ్రెస్ హయాంలో పడావుగా మారిన లక్షలాది ఎకరాల భూమి కేసీఆర్ పాలనతో మళ్లీ పచ్చబడింది. దండిగా నీళ్లు, నిరంతర విద్యుత్ కారణంగా తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారింది. అయితే, రైతులు దర్జాగా బతుకుతుండడం సహించలేని కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ కుట్రలకు తెర లేపింది. 24 గంటల కరెంట్ వృథా అని, మూడు గంటలు చాలని, ఉన్న మోటర్లు ఊడబీకి, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని అన్నదాతలను ఆగం చేస్తున్నది. రైతు భూములకు రక్షణ కల్పిస్తున్న ధరణిని ఎత్తేస్తామని చెబుతున్నది. తాము దర్జాగా బతుకుతుండడాన్ని కాంగ్రెస్ నేతలు ఓర్చుకోలేక పోతున్నారని, ఓటుతో బుద్ధి చెబుతామని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎవుసానికి మూడు గంటల కరెంటు చాలు..
10హెచ్‌పీ మోటర్లు పెట్టుకొని పంటలు పండించుకోవాలని కాంగ్రెసోళ్లు చేస్తున్న వ్యాఖ్యలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత నేతల మాటల్ని వింటున్న రైతన్నలు…పదేండ్ల కిందటి పరిస్థితులే వస్తాయని చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో సరైన కరెంటు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి.. పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి.. అవి కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఇంకా మదిలోనే ఉన్నాయంటున్నారు. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి వాళ్లు ఇచ్చే మూడు గంటల కరెంటుతో పంట పండదు… పెట్టుబడి డబ్బులు కూడా రావని అంటున్నారు. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని చెబుతున్న కాంగ్రెసోళ్లకు అవి ఎవుసానికి ఉపయోగిస్తారా? లేదా? తెలుసుకొని మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. వ్యవసాయానికి పనికిరాని 10హెచ్‌పీ మోటర్ల పేరిట రైతుల నెత్తిన అదనపు ఖర్చుల భారం మోపాలని కాంగ్రెసోళ్లు చూస్తున్నారని మండిపడుతున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో 24గంటల కరెంటుతో బీడుభూములన్నీ పచ్చబడ్డాయని, మేమంతా సంతోషంగా బతుకుతున్నామని అంటున్నారు. మార్పులు తెచ్చి మా చావులను కోరే కాంగ్రెస్‌ను రానివ్వబోమని, మా క్షేమాన్ని తలచే సీఎం కేసీఆర్‌నే మళ్లీ గెలిపించుకుంటామని స్పష్టంచేస్తున్నారు. మూడు గంటల కరెంటు, 10హెచ్‌పీ మోటర్లపై రైతులు వెల్లడించిన అభిప్రాయాలు వారిమాటల్లోనే…
ఖలీల్‌వాడి, నవంబర్ 23 : రైతులకు 3 గంటల కరెంట్ అసలే సరిపోదు. గతంలో రాత్రి కరెంట్ ఉండేది. రాత్రి పూట మోటర్లు చాలు జేసేందుకు పోయి మస్తు తిప్పలు వడ్డం.. సీఎం కేసీఆర్ దయతో నేడు కరెంట్‌కు రంది లేకుండా పోయింది. ఇప్పుడు ఏ సమస్య లేదు. గిప్పుడు కాంగ్రెసోళ్లు ఓట్ల కోసం ఇష్టమచ్చినట్లు మాట్లాడుతుండ్రు. చాలా మంది చిన్న రైతులే ఉన్నరు. పెద్దమోటర్లు పెట్టుడంటే మస్తు పైసల్ అయితై. ఏం తెల్వనోళ్లు ఏమోమో మాట్లాడుతుండ్రు. కేసీఆర్ సారు రైతుల కరెంట్ కష్టాలు తీర్చిండు.
-నారాయణ, రైతు, న్యాల్కల్ గ్రామం
ఒక్క మడి కూడా పారదు
బీఆర్ఎస్ గవర్నమెంటు ఎవుసానికి 24 గంటల కరెంటి ఇచ్చుడుతోటి మంచిగ పంటలు పండించుకుంటున్నం. దిగుబడి మంచిగ అస్తున్నది. రైతుబంధు కూడా ఇచ్చుడుతోటి పెట్టుబడికి రంది లేకుండా పోయింది. గిప్పుడు ఎన్నికలు అచ్చుడుతోటి కాంగ్రెసోళ్లు 3 గంటల కరెంటు చాలని అంటుండ్రు. ఆళ్లకు ఎవుసం గురించి ఏం తెలుసు. మూడు గంటల కరెంట్‌తో ఒక్క మడి కూడా పారదు. మళ్లా పైసల్ పెట్టి 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోమంటుండ్రు. లోవోల్టేజీతోటి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. కాంగ్రెసోళ్లు అంటేనే భయమైతుంది.
-సతీశ్‌రావు, రైతు, న్యాల్కల్ గ్రామం
కాంగ్రెస్‌ను నమ్మితే పాత రోజులే..
రైతులకు 3 గంటల కరెంటు దేనికీ సరిపోదు. ఏ అవగాహనతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటుతోటి రైతులు దర్జాగా పొలాలు పండించుకుంటున్నారు. రాత్రుళ్లు పొలాల దగ్గరకు పోవుడు బాధ తప్పింది. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంట్ కష్టాలే. విద్యుత్ ప్రమాదాలు మళ్లీ జరుగుతాయి. ఏ రైతుకు కూడా 10 హెచ్‌పీ మోటరు అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రతి రైతు మూడు నుంచి ఐదు హెచ్‌పీ మోటర్లే వాడుతున్నారు.
-సాయి రెడ్డి, రైతు, సిర్పూర్
కాంగ్రెసోళ్లకు ఎవుసం ఏం తెలుసు?
రైతులకు మూడు గంటల కరెంటు మస్తు అని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోండ్రని చెబుతున్నారు. వాళ్లకు అసలు వ్యవసాయం గురించి ఏమన్నా తెలుసా? మా ప్రాంతంలో 10 హెచ్‌పీ మోటర్లు ఎవరూ వాడరు. మాకు 5 హెచ్‌పీ మోటర్లే సరిపోతా యి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎందుకు 10హెచ్‌పీ మోటర్లు వినియోగిస్తారు. ఈ మోటర్లు కొనాలంటే లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది. భూగర్భ జలాలు సైతం ఇట్టే ఇంకిపోతాయి. వద్దు మళ్లీ పాత రోజులు రావొద్దు.
– గంగూబాయి,మహిళా రైతు, సిర్పూర్
రేవంత్‌కు ఎవుసం గురించి ఏం తెలుసు.. ?
24 గంటలు ఉచిత కరెంట్‌తో పసిడి పంటలు పండిస్తున్నాం. కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేదు. చిన్న, సన్నకారు రైతులు 10 హెచ్‌పీ మోటర్లు వాడరు. రేవంత్‌రెడ్డి అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడం సరికాదు. నాకు 25 ఎకరాల భూమి ఉంది. ఇందులో రెండు, మూడు పంటలు సాగు చేస్తాను. రెండు, మూడు రోజులకొకసారి నీరు పారిస్తా. నాకు 5 హెచ్‌పీ మోటరుతో పంటలకు సరిపడా నీరందిస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెసోళ్లు ఓట్ల కోసం ఇలా రైతులతో రాజకీయం చేస్తున్నారు. అందుకే 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసే కేసీఆర్ ప్రభుత్వానికే అండగా ఉంటాం.
-భూమన్న, రైతు, కంజర
రైతులు బాగుపడడం కాంగ్రెసోళ్లకు ఇష్టం లేదు
అసలు రైతులు బాగు పడడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. గతం నుంచి ఇదే తంతు. అప్పట్ల ఆళ్లు రాత్రిపూట కరెంటు ఇచ్చుడుతోటి పొలాల పొంటి తెల్లందాక ఉరకవడుతుండె. కరెంట్ షాక్ కొట్టుడు, పాముకాటుతో సచ్చిపోవుడు ఉంటుండె. తెలంగాణ అచ్చినంక సుఖంగా ఇంటికాడనే పడుకుంటున్నాం. రేవంత్‌రెడ్డి మూడు అడుగులు ఉండి.. మూడు గంటల కరెంట్ అంటున్నాడు. ఓట్ల దెబ్బకు రేవంత్ రెడ్డి ఆంధ్రకు పారిపోవుడు ఖాయం.
-సాయవ్వ, మహిళా రైతు, బాడ్సి
కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుల పని ఖతం
కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతే రాజు అని మనం వినడం తప్ప చూడలేము. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటున్నాడు. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నాడు. ఇట్ల చేస్తే మళ్లీ వ్యవసాయం బంద్ చేసుకొని మళ్లా పట్టణాలకు కూలీ పనులకు పోవుడు అయితది. కాంగ్రెసోళ్లు అస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయి. ఇప్పుడు ఇంత మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నాం. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుల పని ఖతమే. నీళ్ల కోసం కొట్టుకునే పరిస్థితులు వస్తాయి. ఇదంతా మనకు అవసరమా. ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదాం.
-నర్సారెడ్డి, రైతు, బాడ్సి
కరెంటు కష్టాలు మళ్లీ వద్దు..
ఖలీల్‌వాడి, నవంబర్ 23 : కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. పంటలు వేయాలంటనే భయపడే పరిస్థితి ఉండేది. రాత్రి పూట కరంటు కోసం పొలాల కాడ పండుకునేటోళ్లం. కానీ బీఆర్ఎస్ సర్కారు వచ్చిన అన్ని బాధలు పోయినయ్. పొద్దున పూటనే పొలాలకు నీళ్లు పారించుకుంటున్నాం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నాం. కాంగ్రెసోళ్లకు రైతులు మంచిగుంటే చూడ బుద్ధి అయితలేనట్లున్నది.
-నర్సయ్య, రైతు, నర్సింగ్‌పల్లి
కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు
కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు గుర్తుకు వస్తాయి. మళ్లా ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలని, రైతులు 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నారు. అసలు వ్యవసాయం గురించి వాళ్లకు ఏం తెలుసు?. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటే మస్తు పైసల్ అయితయ్. అవి ఎవ్వళ్లు ఇస్తారు. అందరూ రైతులు 10హెచ్ మోటర్లు వాడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. మళ్లా కరెంట్ కష్టాలు మొదలై రైతు ఆగమయ్యే ప్రమాదముంది. కాంగ్రెసోళ్లు అద్దు.. ఆళ్ల కరెంటు అద్దు..
-గంగారాం, రైతు, ముదక్పల్లి
మూడు గంటలతోటి ఆగమే
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు ఇస్తామంటున్నారు. మూడు గంటల కరెంటు తోటి మూడు గుంటల భూమి కూడా తడవదు. 24గంటల కరెంటుతో మస్తు సౌలత్ అయ్యింది. పొలాలకు 10హెచ్‌పీ మోటర్లు ఎవ్వళ్లు వాడరు. కాల్వలు, చెరువుల్లో నీళ్లు తోడేందుకే ఈ మోటర్లు వాడుతారు. ఈ మోటర్లు పొలాలకు పెట్టుకుంటే ఒక్కసారికే నీళ్లు గుంజి పడేస్తది. బోర్లు ఎండిపోతాయి. కాంగ్రెస్‌కు ఓటు వేసి మళ్లా కరెంటు కష్టాలు తెచ్చుకునుడు అవసరమా? గిప్పుడు 24 కరెంటుతో మంచిగా పంటలు పండించుకుంటున్నాం. తెలిసి తెలిసి మళ్లా పాత కష్టాలు తెచ్చునుడు అవసరమా?
-మహేశ్‌రెడ్డి, రైతు, ముదక్పల్లి
24 గంటల కరెంట్.. రైతుకు ఊపిరి
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి కరెంట్ సమృద్ధిగా ఇస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు మూడు గంటల కరెంట్ సరిపోదు. కాంగ్రెస్ పాలన వస్తే అంధకారం తప్పదు. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులు అవస్థలు పడ్డారు. అప్పట్లో ఎన్నోసార్లు కరెంట్ కోసం సబ్స్టేషన్లను ముట్టడించాం. వచ్చీరాని కరెంట్‌తో మోటర్లు కాలిపోయేవి. రిపేర్ చేయించడంతో రైతులపై ఆర్థిక భారం పడేది. నీరు అందక పంటలు ఎండిపోయేవి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మొద్దు. వ్యవసాయానికి 24 గంటల కరెంటుతో ఎంతో మేలు జరుగుతున్నది. పంటలకు నీరు అందించేందుకు ఏ సమయంలోనైనా రైతులు మోటర్లు పెట్టు కుంటున్నారు. రైతులు ఆలోచించి రైతు ప్రభుత్వానికి అండగా నిలువాలి. కరెంట్ 3 గంటలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి.
-పెద్ద సాయిలు, రైతు, ముదక్పల్లి
కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు గుర్తుకు వస్తాయి.
కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ అనుబంధ రంగాలు అన్ని అనేక ఇబ్బందులు పడ్డాయి. తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ సీఎం కావడంతో కొత్త వెలుగులు వచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ కాంగ్రెస్ నాయకులు పూటకో మాట మాట్లడుతున్నారు. రాష్ట్రంలో ఇంత మంచి కరెంట్ ఇస్తున్న ప్రభుత్వాన్ని వదులుకునే పరిస్థితి లేదు . మూడు గంటల కరెంట్‌పై మాట్లాడిన వారికి పదిరోజుల్లో రైతులు తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
-కుమ్మరి నారాయణ, రైతు, బాడ్సి
ఒక్క పంట కూడా పండదు..
24 గంటల కరెంట్ ఇవ్వకపోతే పంటలు పండవు. రైతులు మళ్లీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. మూడు గంటలతోటి ఒక్క మడి కూడా పారదు. కాంగ్రెస్ హయాంలో ఈ బాధలన్నీ అనుభవించాం. నీళ్లులేక మస్తు కష్టాలు పడ్డాం. తెలిసితెలిసి మళ్లీ ఆ పరిస్థితిని తెచ్చుకోలేము. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే రైతులు బతుకుతారు. లేదంటే మళ్లీ ఆత్మహత్యలే శరణ్యం అవుతాయి.
-కూనల్ రెడ్డి, రైతు, బాడ్సి
మూడు గంటల కరెంటుతో పొలాలు ఎండుడే..
కాంగ్రెస్ హయాంలో నా ఇంటాయన సచ్చిపోయిండు కాంగ్రెస్ హయాంలోనే మా ఇంటాయన సచ్చిపోయిండు. అప్పట్ల రాత్రిపూట కరెంటు ఇచ్చుడుతోటి పొలానికి నీరు పెట్టేతందుకు పోయిండు. బోరు చాలు చేస్తుండగా పాము కరిచి ఆడనే సచ్చిపోయిండు. అప్పుడే మంచి కరెంటు ఇస్తే మా ఇంటాయన సచ్చిపోయేటోడు కాదు. కాంగ్రెసోళ్లు అస్తే మళ్లా కరెంటు కష్టాలు తప్పవు. మళ్లా రైతులు తెల్లందాక పొలాల పొంటి ఉరకవడతది. అందరూ ఆలోచన జేయాలె.
-పోసాని, మంచిప్ప, మోపాల్ మండలం
3 గంటల కరెంట్ సరిపోదు
3 గంటల కరెంట్‌తో మా పొలాలు సాగు కావు. కాం గ్రెస్ నాయకులు చెప్పినట్లు మూడు గంటల కరెంట్‌తో రైతులు బాగపడరు. మాకు 3 ఎకరాల పొలం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో 5 హెచ్‌పీ మోటర్లను వాడుతున్నాం. కాంగ్రెస్ 3 గంటల కరెంట్ ఇస్తాం.. రైతులు 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నారు. రైతులందరూ ఒకేసారి 10హెచ్‌పీ మోటర్లను వేస్తే ట్రాన్స్ఫార్మర్ పేలిపోతాయి. మా రైతులకు సర్కారు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లు 25 హెచ్‌పీవీ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ సర్కారు 24 గంటల కరెంట్ ఇస్తుంది. పంటలు మంచిగా పండుతున్నాయి. దిగుబడి మంచిగా వస్తుంది.
-ముత్యం రెడ్డి, రైతు, సిర్పూర్
కాంగ్రెస్‌వి తప్పుడు మాటలు..
గతంలో నీళ్లు, కరెంటు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ విషయం అందరికీ తెలుసు. కరువు వచ్చినప్పుడు ఏ పార్టీ వచ్చి ఆదుకోలేదు. తెలంగాణ వచ్చిన తరువాతనే నీళ్లు వచ్చినాయి. రాత్రి పూట పొలాలకు నీరు పారిచ్చేతందుకు పోతే ఇంటికి వస్తామో.. రామో తెలియని పరిస్థితి ఉండేది. సీఎం కేసీఆర్ అనుకున్నది సాధించిండు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల కరెంట్, రైతుబంధు ఇస్తుంటే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఎరువులు అందుబాటులో ఉంచి పంటలకు మద్దతు ధర ఇస్తున్నారు. ఏరికోరి మళ్లా ఆ బాధలు తెచ్చుకోవద్దు.
రాజిరెడ్డి, రైతు, బాడ్సి
మూడు గంటలు అయితే మునుగుడే
రేవంత్ రెడ్డి చెప్పినట్లు మూడు గంటల కరెంట్ అయితే రైతులు నిండా మునగక తప్పదు. సోయి ఉండి మాట్లడుతున్నాడో లేక మాట్లడుతున్నాడో తెలియడం లేదు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుడంటే అయ్యే పని కాదు. రైతులను ఆగం చేసుడు తప్ప మరేమీ లేదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిట్లనే చేసింది. రోజుకు రెండు మూడు గంటలు కరెంటు ఇచ్చుడుతోటి వ్యవసాయంతో పాటు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. సీఎం కేసీఆర్ కృషితో పూర్తిగా కోలుకుంటున్న సమయంలో కాంగ్రెస్ వాళ్లు ప్రజలకు మాయ మాటలు చెప్పడు మొదలు పెట్టిండ్రు. ఆళ్ల మాటలు నమ్మితే నిండా మునుగుడే.
మెచ్చ నారాయణ, రైతు, బాడ్సి
దొంగ మాటలు చెప్పుడు బంద్ చేయాలి
గ్రామాల్లో ఎన్ని మోటర్లు ఉన్నాయో తెలుసా రేవంత్‌రెడ్డి. ఒక్క మోటరుకు 50 వేల రూపాయాలు అవుతుంది. దానికి ఎంత ఖర్చు అవుతుంది. ఎంత కరెంట్ బిల్లు వస్తుందో అవగాహన లేకుండా మాట్లడుతున్నాడు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రశాంతంగా ఉన్నాం. 24 గంటల కరెంట్ వస్తుంది. రాత్రి పోయే పరిస్థితి లేదు. రైతు బంధు, రైతు బీమా వస్తుంది. ఎరువులు ఇస్తున్నారు. పచ్చగా ఉన్న గ్రామాల్లో రేవంత్ రెడ్డి మళ్లీ చిచ్చుపెట్టాలని చూస్తుండు. ఈ బుద్ధి కాంగ్రెస్ పరిపాలనలో ఏమైంది. కర్ణాటకలో ఎందుకు ఇవ్వడం లేదు. మాయ మాటలు చెప్పడానికి వస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
-మైసన్న, రైతు, మంచిప్ప
అప్పటి కరెంటు కష్టాలు మళ్లీ వద్దు
అప్పటి కరెంట్ కష్టాలు మళ్లీ రావద్దు. రాత్రి పూట పొలాల కాడ పండుకునేటోళ్లం. కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెల్వదు. దీంతో అక్కడే కావలి కాసేటోళ్లం. రాత్రిపూట ఇచ్చే కరెంట్‌తో గ్రామంలో చాలా మంది రైతులు నీళ్లు పెట్టేందుకు పోయి కరెంట్ షాక్‌తో, పాము కాటుకు గురై చనిపోయారు. కరెంట్ సరిగా రాక పంటలు ఎండిపోయేవి. ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుండడంతో రైతులు అవసరం వచ్చినప్పుడల్లా నీళ్లు పారించుకుంటున్నారు. రెండు పంటలు పండిస్తూ రైతు రాజుగా జీవిస్తుండు. పుట్ల కొద్ది వడ్లు పండుతున్నాయి. మళ్లీ కాంగ్రెస్ వస్తే పొలాల దగ్గరే పండుకోవాలి. ఆ కష్టం మళ్లీ మాకు వద్దు.
-సత్యనారాయణ, రైతు, కంజర
కాంగ్రెస్ వస్తే బిచ్చమెత్తుకునుడే..
కాంగ్రెస్ హయాంలో అడుగడుగునా కరెంటు కష్టాలే. అర్ధరాత్రి పొలానికి నీళ్లు పట్టేతందుకు వెళ్లి ఎంతోమంది సచ్చిపోయిండ్రు. తెలంగాణ వచ్చి న తరువాత ఎలాంటి ఇబ్బందులు లేవు. 24 గంటల కరెంటు ఇవ్వడంతో అర్థరాత్రి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎరువులు, రైతు బంధు, రైతు బీమా ఇచ్చి కేసీఆర్ సారు ఆదుకుంటున్నారు. గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే నెలల సమయం పట్టేది. మళ్లీ కాంగ్రెస్ వస్తే బిచ్చం ఎత్తుకునేడే అయితది. ఆ బాధలు రావొద్దంటే మళ్లీ కేసీఆర్ సార్నే గెలిపించుకోవాలి.
-గంగధర్, మంచిప్ప, మోపాల్ మండలం
కేసీఆర్ సార్ అచ్చినంకనే కరెంటు కష్టాలు పోయినయ్..
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఇచ్చుడుతోటి రందిలేకుండా పోయింది. కాంగ్రెస్ నాయకులు కరెంటు విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పొరపాటున కాంగ్రెసోళ్లకు ఓటు వేస్తే మళ్లీ కష్టాలు తప్పవు. సంతోషంగా ఉన్న జీవితాల్లో మళ్లా కష్టాలు కొని తెచ్చుకునేడే అయితది. కాంగ్రెసోళ్లను రైతులు ఎవరూ నమ్మరు. కష్టాలు తీర్చిన కేసీఆర్‌కే అండగా నిలబడతాం.
-గంగాధర్, రైతు, నర్సింగ్‌పల్లి
పొలాలకు 10 హెచ్‌పీ మోటర్లు ఎట్లా సాధ్యం
చిన్న, సన్నకారు రైతులు 10 హెచ్‌పీ మోటర్లు ఏర్పాటు చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది. 10 హెచ్‌పీ మోటర్లు అయితే మూడు గంటల కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. లక్షలు ఖర్చు చేసి ఒకటి రెండు ఎకరాల రైతులు 10 హెచ్‌పీ మోటర్లు ఎట్లా పెట్టుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే సన్న, చిన్నకారు రైతులకు ఇబ్బందులు తప్పవు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ వస్తుంటే హాయిగా ఎప్పుడంటే అప్పుడు మోటరు చాలు చేసుకొని పొలం తడుపుకుంటున్నాం. కాంగ్రెస్ గెలిస్తే మనలాంటి చిన్న రైతులకు కష్టాలు తప్పవు. సన్న, చిన్నకారు రైతులు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి.
-చందర్, రైతు, ముదక్పల్లి
మూడు గంటలతోటి గడ్డి కూడా పెంచలేం
సీఎం కేసీఆర్ అచ్చిన కాడి నుంచి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. తీరం లేకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చుడుతోటి బంగా రు పంటలు పండించుకుంటున్నాం. పంటలకు నీళ్లు పారిచ్చేందుకు తెల్లందాక బాయిలకాడికి, బోర్లకాడికి పోయే బాధ తప్పింది. కరెంట్ తిప్పలు లేకపోవుడుతోటి గుంట పొలం కూడా వదలకుండా పంటలు పండిస్తున్నాం. 24 గంటల కరెంట్‌ను 3 గంటలకు తగ్గించినట్లయితే గొడ్డు, గోదాకు గడ్డి కూడా పెంచే పరిస్థితి ఉండదు. ఎన్నడో పోయిన కరెంట్ బాధలను మళ్ల తీసుకొస్తామంటున్న పార్టీలను రైతులు, రైతు కూలీలు, రైతు కుటుంబాల ఆదరించవు. బీఆర్ఎస్తోనే మాలాంటి రైతులకు భరోసా.
-రాములు, రైతు, నర్సింగ్‌పల్లి
మళ్లా మా బతుకులు ఆగం జేసుకోం..
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్ప వు. అప్పట్ల కరెంట్‌తోని గోస పడ్డది అప్పుడే మరిచిపోతమా ? కరెంట్ కోసం రాత్రిళ్లు టార్చిలైటు పట్టుకుని బాయిలకాడ కావలి ఉండేటోళ్లం. అయినా ఇట్ల అచ్చినట్టు అచ్చి దాని పాడుగాను కరెంట్ బందయ్యేది. మళ్లా కరెంటు కోసం కావలి కాసేది. ఆ రోజులు గుర్తొస్తేనే ఈపులో వణుకు పుడ్తది. తెలంగాణ వచ్చినంక 24 గంటలు కరెంటేనాయే. ఎప్పుడంటే అప్పుడు వచ్చి పంటకు నీళ్లు వదులుతున్నం. కాలిన మోటర్లను ట్రాక్టర్ల తీసుకెళ్లే బాధ లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లా కాంగ్రెస్‌కు ఓటేసి మా బతుకులను మేమే ఆగం జేసుకుంటమా.. రైతును బతికించిన బీఆర్ఎస్కే మా ఓట్లు.
-పోశెట్టి, రైతు, ముదక్పల్లి
ఓర్వలేక కాంగ్రెస్ కుట్రలు
తెలంగాణ వచ్చిన తరువాత చాలా అభివృద్ది చెందింది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ మీద పడ్డాయి అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. రైతులు 10హెచ్‌పీ మోటర్లు ఎక్కడా వాడరు. రైతులను నాశనం చేసే పనులు చేయవద్దు. రైతుల గురించి ఆలోచన చేస్తున్న బీఆర్ఎస్కే అందరూ అండగా నిలబడాలె.
మోహన్ రెడ్డి, రైతు, మంచిప్ప
3 గంటలు పనికిరాని మాట
కాంగ్రెసోళ్లు అన్నట్లు వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ ఇవ్వడమనేది పనికిరాని మాట. మూడు గంటల విద్యుత్ ఇస్తే మోటర్ల కెపాసిటీని పెంచాలి. అలా పెంచితే రైతులు పండించిన పంట మొత్తం మోటర్లు మార్చడానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న 24 గంటల విద్యుత్ సరఫరానే కరెక్ట్. రైతులు ఉన్న మోటర్లతోనే నిరంతరం కరెంట్‌తో పంటలకు నీళ్లు పారించుకుంటున్నరు.
-సుబ్బరావు, రైతు, ముదక్పల్లి