సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Dec 31, 2020 , 01:27:09

కరోనా మిగిల్చిన విషాదం

కరోనా మిగిల్చిన విషాదం

  • బంధాల మధ్య అంతరాన్ని పెంచిన కొవిడ్‌-19
  • పెద్ద దిక్కును కోల్పోయిన ఎన్నో కుటుంబాలు
  • చివరి చూపునకు సైతం నోచుకోని వైనం..
  • అందరూ ఉన్నా అనాథల్లా మిగిలిపోయిన వారెందరో..

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఉమ్మడి జిల్లాలోనూ ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది... బంధాల మధ్య అంతరాన్ని పెంచింది. అయినవారే కానివారయ్యారు. కట్టుకున్న వారి కడసారి చూపు దక్కలేదు. ఆపద సమయంలో అప్తులు పరాయి వారయ్యారు. కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడిచేవారే కరువయ్యారు. విపత్కర పరిస్థితుల్లో మేమున్నామని ధైర్యం చెప్పే వారే లేకుండా పోయారు. కనీసం పలకరింపులకు నోచుకోని దుస్థితి నెలకొంది. కరోనా విలయానికి ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగి పోయాయి. కొవిడ్‌ పంజాకు ఎంతో మంది బలయ్యారు. కరోనా కాటుకు పెద్ద దిక్కును కోల్పోయి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయిన వారిని పోగొట్టుకొని, పోషణ భారమై విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 

కరోనా విసిరిన పంజాకు ఎందరో మంది బలయ్యారు. అయిన వారిని పోగొట్టుకొని అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనాతో మృతి చెందిన వారి చివరి చూపునకు సైతం నోచుకోక కుటుంబీకులు నరకయాతన అనుభవించారు. దవాఖాన నుంచి మృతదేహాన్ని అంబులెన్సులో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అయిన వారు ఉన్నా అనాథ శవాల్లా దహన సంస్కారాలు నిర్వహించడం ఆ కుటుంబాలను ఎంతో క్షోభకు గురిచేసింది. కష్టకాలంలో తమను పలుకరించేవారు లేక కన్నీటిని దిగమింగారు. ధైర్యం చెప్పేవారు లేక దిక్కులేని వారయ్యారు. ఓదార్పునకు నోచుకోని దయనీయ పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరోనా విలయానికి ఎన్నో కుటుంబాలు విషాద సాగరంలో మునిగిపోయాయి.  

ఆగమైనబతుకులు

డిచ్‌పల్లి : ఇందల్వాయి మండలం గన్నారం రైతు బంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్‌ పందెం (జామకాయల) చిన్న గంగారాం కరోనా మహమ్మారితో సెప్టెంబర్‌ 2వ తేదీన మృతిచెందారు. 2018లో గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని సన్‌షైన్‌ దవాఖానలో స్టంట్‌ వేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా హైదరాబాద్‌కు వెళ్లి చెకప్‌ చేయించుకునేవారు. ఆగస్టు 30న తీవ్ర జ్వరం రావడంతో నిజామాబాద్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వారు నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ మూడు రోజులపాటు చికిత్స పొందిన గంగారాం తెల్లవారుజామున మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కు అయిన గంగారాం కరోనాతో చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డుపాలైంది. కనీసం చివరి చూపునకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ దవాఖాన నుంచి నేరుగా శ్మశాన వాటికు అంబులెన్స్‌ ద్వారా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 

పగవారికి కూడా ఇలాంటి బాధ రాకూడదు

కరోనా వస్తే జీవితాలు తారుమారు అవుతాయి. నా భర్త చనిపోయిన తరువాత మా ఇంటికి రావడానికి చాలా మంది భయపడ్డా రు. నా భర్త శవాన్ని గ్రామంలోకి తీసుకురాకుండా నేరుగా శ్మశాన వాటికకు అంబులెన్స్‌ ద్వారా తరలించి అంత్యక్రియలు నిర్వహించా రు. ఇలాంటి బాధ పగవారికి కూడా రాకూడ దు. కరోనా వచ్చిందని గ్రామస్తులు కానీ, కు టుంబ సభ్యులు కానీ ఎవ్వరూ అక్కడికి రాలే దు. నా భర్తను చివరిసారిగా చూసుకోలేని దుస్థి తి నెలకొంది. మా ఆయన మృతితో నా పిల్లలు, నేను దిక్కులేని వాళ్లం అయ్యాం. ప్రభుత్వమే మా కుటుంబాన్ని ఆదుకోవాలి.

-లక్ష్మి, గంగారాం భార్య

మామ అల్లుళ్లు బలి

బాన్సువాడ : అల్లుడి ఆరోగ్యం బాగా లేదని దవాఖానలో చూయించేందుకు మామ వెంట వెళ్లాడు. మొదట అల్లుడు, తర్వాత మామ ఇద్దరూ కొవిడ్‌ బారిన పడి మృతిచెందారు. నస్రుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ గ్రామానికి చెందిన సొసైటీ మాజీ డైరెక్టర్‌ కాంతురెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను నిజాంసాగర్‌ మండలం ముగ్ధుంపూర్‌కు చెందిన శ్రీకాంత్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. శ్రీకాంత్‌రెడ్డి కొంత కాలంగా తలనొప్పితో బాధపడుతున్నాడు. కాంతురెడ్డి అల్లుడిని తీసుకొని సెప్టెంబర్‌ 5న హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్లారు. శ్రీకాంత్‌రెడ్డిని పరీక్షించిన వైద్యులు బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధిగా నిర్ధారించారు. అక్కడి వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించి ఐసీయూలో అడ్మిట్‌ చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో ఐసీయూలో ఉన్న వారందరికీ ప్రతి రోజూ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఐసీయూ ఇన్‌చార్జి వైద్యుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో వార్డులో చికిత్స పొందుతున్న 17 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడడంతో శ్రీకాంత్‌రెడ్డిని అంబులెన్సులో గాంధీ దవాఖానకు తరలించారు. అదే అంబులెన్సులో కాంతురెడ్డి సైతం వెళ్లారు. అక్కడ కరోనాకు సంబంధించి వైద్యం అందించారు. పరిస్థితి విషమించి సెప్టెంబర్‌ 22న శ్రీకాంత్‌రెడ్డి మృతిచెందారు. ఆయన స్వగ్రామం నిజాంసాగర్‌ మండలంలోని ముగ్ధుంపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తయిన నాలుగైదు రోజులకు కాంతురెడ్డిలో కరోనా లక్షణాలు కనిపించాయి. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో పరీక్షలు చేయించుకోగా నిమోనియాగా నిర్ధారించారు. జ్వరం, జలుబు తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని కిమ్స్‌కు వెళ్లాడు. పరీక్షలు చేయించుకోగా కొవిడ్‌గా నిర్ధారించారు. 15 రోజులు అక్కడే ఉండి చికిత్స చేయించుకున్నారు. సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేశారు. పరిస్థితి విషమించి కాంతురెడ్డి మృతిచెందాడు. స్వగ్రామం అంకోల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. 

వీధిన పడిన కుటుంబం

ఊడెపు కాంతురెడ్డి, ఊడెపు భాస్కర్‌రెడ్డి ఇద్దరూ అన్నదమ్ములు. పది సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భాస్కర్‌రెడ్డి మృతిచెందాడు. దీంతో రెండు కుటుంబాల బాధ్యతలు కాంతురెడ్డి చూసుకుంటున్నారు. కాంతురెడ్డి పెద్ద కుమార్తె భర్త శ్రీకాంత్‌రెడ్డి కరోనాతో మృతిచెందగా, అల్లుడి కోసం దవాఖానకు వెళ్లిన మామ సైతం కొవిడ్‌తో మృతిచెందారు. ఇద్దరి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలయ్యారు. పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం రోడ్డున పడింది. 

మాజీ మేయర్‌ అత్తమ్మ..

ఖలీల్‌వాడి : నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన నగర మాజీ మేయర్‌ ఆకుల సుజాత అత్తమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆకుల శ్రీశైలం తల్లి ఆకుల అనసూయ జూలై 21న కరోనాతో మృతిచెందారు. మొదట కుటుంబీకులు కరోనా బారిన పడగా తర్వాత అనసూయకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అందరూ ఇంట్లోనే ఉండి చికిత్స పొందారు. కొవిడ్‌ బారిన పడిన మూడు రోజులకే అనసూయ మృతిచెందారు. అంబులెన్సులో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. 

ఆ బాధ వర్ణనాతీతం

కరోనా వస్తే నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అయినవాళ్లు కూడా దగ్గరకు రాని పరిస్థితి ఉంటుంది. కరోనా వస్తే చావుకు దగ్గరగా వెళ్లి వచ్చినట్లే. కరోనా బారిన పడ్డవారికే ఆ బాధ తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  

- ఆకుల శ్రీశైలం

కరోనా కాటుకు వీధిన పడిన కుటుంబం

నిజాంసాగర్‌ : భార్యాభర్త, ఇద్దరు కుమార్తెలు. సంతోషంగా గడుస్తున్న రోజులు. ఒక్క సారిగా మాయదారి కరోనాతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం రోడ్డున పడింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. మండలంలోని మహ్మద్‌నగర్‌కు చెందిన మిడత కాశీరాం(32) సెప్టెంబర్‌లో కరోనా బారిన పడ్డాడు. బాన్సువాడ మండలంలోని బోర్లంలోని క్వారంటైన్‌ కేంద్రంలో చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 6వ తేదీన మృతిచెందాడు. మృతుడికి భార్య లక్షి, కుమార్తెలు గంగోత్రి, గాయత్రి ఉన్నారు. 

మగ దిక్కు లేకుండా అయింది

కాశీరాం తండ్రి సాయవ్వ, తల్లి నాగవ్వ. వీరికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు మోహన్‌ 2004లో వ్యవసాయ బోరుబావి వద్ద అకాల మరణం చెందాడు. రెండో కుమారుడు భాగయ్య ఐదు సంవత్సరాల కిందట ఆటో ప్రమాదంలో మృతి చెందాడు. మిగిలిన  ఒకే ఒక్క చిన్నకుమారుడు కాశీరాం. ఈయన కరోనాతో మృతి చెందగా ఆ ఇంట్లో మగదిక్కు లేకుండా అయింది. logo