TS TET | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రమంతా వైభవంగా జరుపుకొనే పండుగ. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్వరాష్ట్రం సిద్ధించిన రోజు టెట్ నిర్వహించాలని వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ దాస్యశృంఖలాలు తెగింది.. ప్రజలు స్వేచ్ఛావాయువులను పీల్చుకున్నది జూన్ రెండో తేదీనే. వందలాది మంది అమరులను, వారి త్యాగాలను స్మరించుకొనేది ఇదే రోజు. ఈ దృష్ట్యా జూన్ 2న సెలవుగా పాటిస్తారు. కానీ రాష్ట్ర విద్యాశాఖ మాత్రం జూన్ -2 టెట్ పేపర్ -1 రెండు సెషన్లలో నిర్వహిస్తామని తాజాగా ప్రకటించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ మేరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను టెట్ కన్వీనర్ రాధారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ గతంలో ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 2తోనే పరీక్షలు ముగియనున్నాయి. జూన్ 3న పరీక్షలు నిర్వహించే అవకాశమున్నా జూన్ 2న పరీక్షలు నిర్వహించడంలో అత్యంత దారుణమని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎఫెక్ట్‌తో మూడు రోజులు విరామం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షల షెడ్యూల్లో అధికారులు స్వల్పమార్పులు చేశారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మూడురోజుల పాటు టెట్ పరీక్షలకు విరామం ప్రకటించారు. దీంతో టెట్ జూన్ 3న కాకుండా జూన్ 2నే ముగియనుంది.
