ముంబై, మే 3: విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. వరుసగా మూడోవారం కూడా ఫారెక్స్ రిజర్వులు 2.41 బిలియన్ డాలర్లు తరిగిపోయాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఏప్రిల్ 26తో ముగిసిన వారాంతానికిగాను రిజర్వులు 637.922 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తన వారాంతపు సమీక్షలో పేర్కొంది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 2.28 బిలియన్ డాలర్లు తగ్గి 640.33 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది. గత నెల మొదట్లో రిజర్వులు చారిత్రక గరిష్ఠ స్థాయి 648.562 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.
గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.159 బిలియన్ డాలర్లు తగ్గి 559.701 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. యూరో, పౌండ్, యెన్ కరెన్సీలు హెచ్చుతగ్గుదలకు లోనుకావడంతో విదేశీ మారకం నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. అలాగే పసిడి రిజర్వులు కూడా 1.275 బిలియన్ డాలర్లు తగ్గి 55.533 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ 15 మిలియన్ డాలర్లు ఎగబాకి 18.048 బిలియన్ డాలర్లకు, ఐఎంఎఫ్ వద్ద నిల్వలు 8 మిలియన్ డాలర్లు అధికమై 4.639 బిలియన్ డాలర్లకు చేరాయి.