గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Jul 04, 2020 , 02:46:04

ఒక్కడే.. ఆరుగురికి అంటించాడు!

ఒక్కడే.. ఆరుగురికి అంటించాడు!

  • l రెండు రోజుల క్రితం టీచర్‌కు కరోనా
  • l ఆయన నుంచి ఆరుగురికి వైరస్
  • l బిచ్కుంద, పెద్దకొడప్‌గల్ మండలాల్లో కలకలం
  • l తాజాగా ఉమ్మడి జిల్లాలో 11 కేసులు నమోదు

నిజాంసాగర్ రూరల్/ బిచ్కుంద : ఒకే వ్యక్తి ఆరుగురికి కరోనా వైరస్‌ను అంటించాడు. మొదట బిచ్కుందలోని ఓ చెప్పుల దుకాణం యజమానికి పాజిటివ్ నిర్ధారణ కాగా అతడి ద్వారా చెప్పు ల దుకాణంలో పనిచేసే రాజుల్లా గ్రామానికి చెందిన మరో వ్యక్తికి సోకింది. దుకాణ యజమానితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన బిచ్కుందలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఈనెల ఒకటో తేదీన కరోనా నిర్ధారణ అయింది. ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న కుటుంబసభ్యులతో పాటు పెద్దకొడప్‌గల్ మండలంలోని ఓ తండాకు చెందిన అతడి బంధువులకూ సోకింది. కామారెడ్డి జిల్లాలో శుక్రవారం నమోదైన ఆరు కేసుల్లో అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వారే కావడం గమనార్హం. బిచ్కుంద మండలంలో నలుగురికి, పెద్ద కొడప్‌గల్ మండలంలో ఇద్దరికి కరోనా సోకింది. జుక్కల్ మండలంలోని ఏడ్గి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఆయనతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న 52 మందికి హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ వైద్యు లు సూచించారు. ఇప్పటి వరకు బిచ్కుంద, పెద్దకొడప్‌గల్ మండలాల్లో కలిపి పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు బిచ్కుంద, పెద్దకొడప్‌గల్ మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ఆంక్షలు విధించుకుంటున్నారు. 

నిజాంసాగర్‌లో వివరాల సేకరణ.. 

బాన్సువాడ పట్టణంలోని ఓ పిల్లల దవాఖాన వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి వద్ద ఇటీవల చికిత్స పొందిన చిన్న పిల్లల వివరాలను నిజాంసాగర్ వైద్యసిబ్బంది, పోలీసులు సేకరిస్తున్నారు. నిజాంసాగర్‌లో ముగ్గురు, హసన్‌పల్లి, మల్లూర్, గున్కుల్, మర్పల్లి, కొమలంచ గ్రామాల నుంచి మొత్తం తొమ్మిది మంది చిన్నారులు అతడి వద్ద చికిత్స చేయించుకున్నట్లు గుర్తించారు. దీంతో చిన్నారులు, వారి కుటుంబసభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజాంసాగర్ పంచాయతీ కార్యదర్శి క్యాకప్ప, ఏఎన్‌ఎం సునీత సూచించారు.  

ఏఆర్‌పీ క్యాంప్ గ్రామంలో అవగాహన.. 

ఎడపల్లి : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ని ఏఆర్‌పీ క్యాంప్ గ్రామంలో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఎడపల్లి పీహెచ్‌సీ వైద్యురాలు జువేరియా సుల్తానా శుక్రవారం తెలిపారు. సదరు వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖానకు వెళ్లగా.. వైద్యులు శాంపిళ్లను సేకరించి పరీక్షలు చేయించారన్నారు. రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. విషయం తెలిసిన స్థానిక వైద్యులు సదరు వృద్ధురాలి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులందరికీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న మహమ్మారి.. 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరుగా విస్తరిస్తున్నది. గ్రామాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరింది. శుక్రవారం మరో ఐదు కేసు లు నమోదయ్యాయి. ఎడపల్లి మండలంలో ఒకటి, నగరంలోని దుబ్బ, అర్సపల్లి, గౌతంనగర్, వినాయక్‌నగర్‌లో ఒక్కొక్కరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 131కి చేరుకున్నది. కామారెడ్డి జిల్లాలో తాజాగా శుక్రవారం మరో ఆరుగురు కరోనా బారిన పడ్డారు. బిచ్కుందకు చెందిన నలుగురు, పెద్దకొడప్‌గల్‌కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వీరంతా గతంలో పాజిటివ్ నిర్ధారణ అయిన చెప్పుల వ్యాపారితో ప్రైమరీ కాం టాక్ట్ అయిన వారు అని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 


logo