శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Jun 08, 2020 , 03:18:23

పసుపు సాగు.. లాభాలు బాగు

పసుపు సాగు.. లాభాలు బాగు

మోర్తాడ్‌ :జిల్లాలో పసుపు పంట సాగులో ఆర్మూర్‌ డివిజన్‌ రైతులు ముందుంటారు. జిల్లా వ్యాప్తంగా ఏటా 40 వేల ఎకరాల్లో పసుపు పంట పండిస్తే, ఒక్క ఆర్మూర్‌ డివిజన్‌లోనే 30 వేల ఎకరాల్లో ఈ పంటను పండిస్తుంటారు. అంటే ఈ ప్రాంత రైతులు ఎంతో ఆసక్తితో ఈ పంటను సాగు చేస్తారు. పసుపు విత్తడానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడ చూసినా పసుపు విత్తనాన్ని తయారు చేసుకోవడం, విత్తడం కనిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో పంటవేసే ముందు నుంచి విత్తే వరకు, పంట రకం, పంటసాగు విధానాల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.

పోషకలోపాలు

పసుపుతోటల్లో ఆకు అంచులు ఎండిపోవడాన్ని పొటాష్‌ లోపంగా గుర్తించవచ్చు. ఈలోపం నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల మల్టికే లేదా పరీమాక్స్‌లాండ్‌ పోషకాలను 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఇనుపధాతులోపం వచ్చినప్పుడు ఆకుల ఈనెల మధ్యభాగం తెల్లగా మారడం క్రమేపి ఆకు అంతా తెల్లగా మారుతుంది. నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల ఫెర్రస్‌ సల్ఫేట్‌ లేదా అన్నభేది, ఒకగ్రాము నిమ్మ ఉప్పు కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. జింకుధాతు లోపం వచ్చిన ముదురు ఆకుల్లో ఈనెల మధ్యభాగం లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగుకు మారుతుంది. నివారణకు దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్‌సల్ఫేట్‌ వేసుకోవాలి. తోటల్లో లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 5 గ్రాముల జింక్‌సల్ఫేట్‌ను కలిపి రెండుసార్లు పిచికారీ చేయాలి.  

పసుపు పంట వేసేందుకు భూమిని సిద్ధం చేసుకోవడం

1వ రోజు : భూమిని నాలుగైదు సార్లు ట్రాక్టర్‌తో దుక్కిదున్ని, 10 నుంచి 15 టన్నుల నల్లమట్టి, పశువుల ఎరువు వేసుకుని కలియదున్నాలి. ఆఖరిదుక్కిలో 5 బస్తాల వేపపిండి, 6 బస్తాల సింగిల్‌సూపర్‌, ఒక బస్తా పొటాష్‌, 20 కిలోల జింక్‌ వేసుకోవాలి. ఆరోగ్యకరమైన విత్తన దుంపలను ఎంపిక చేసుకుని 15 గ్రాముల ముక్కలుగా కత్తిరించుకోవాలి. ప్రతి ముక్కకూ రెండు కణుపులు ఉండేలా చూసుకోవాలి. విత్తనశుద్ధి చేసుకోవాలి.

2వ రోజు : పసుపుతోటలను ఎత్తుమడులుగా (బెడ్‌) తయారు చేసుకుని దుంపలను విత్తుకోవాలి.

3వ రోజు : కలుపుమందు అట్రాజిన్‌ 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

10, 20, 30వ రోజు : వర్షం కురవని పక్షంలో నీటి తడులు ఇవ్వాలి, కలుపు నివారణ చేపట్టాలి.

40వ రోజు : 5 బస్తాల వేపపిండి, 2 బస్తాల యూరియా, 10 కిలోల కార్బోఫ్యూరాన్‌ గుళికలు కలిపి చల్లాలి. 

50, 60, 70వ రోజు : నీటితడులు వారానికి ఒకసారి ఇవ్వాలి. సుకధాతు పోషకాలు పిచికారీ చేసుకోవాలి. కలుపును నివారించాలి. ఆకుమచ్చ నివారణకు ప్రోపికోనాజోల్‌, మోనోక్రోటాపాస్‌ను పిచికారీ చేయాలి.

80వ రోజు : 2 బస్తాల యూరియా, ఒకబస్తా పొటాష్‌ వేసుకోవాలి. వీలును బట్టి నీటి తడులు ఇవ్వాలి.

90, 100, 110వ రోజు : అవసరాన్ని బట్టి కలుపు తీయించాలి. వారానికి ఒకసారి నీటితడులు ఇవ్వాలి. సూక్ష్మధాతు పోషకాలు చల్లుకోవాలి. కార్బండయిజమ్‌, అసిపెట్‌ పిచికారీ చేయాలి.

130, 140వ రోజు : వారానికి ఒకసారి నీటితడులు ఇవ్వడంతోపాటు, కూలీలతో కలుపుతీయించాలి.

150వ రోజు : దుంపకుళ్లు లక్షణాలు కనిపిస్తే రిడొమిల్‌, మరియు మోనోక్రోటాపాస్‌ మొక్క కాండం వద్ద పోసుకోవాలి. అవసరమైతే 10 కిలోల 3జీ కార్బోఫ్యూరాన్‌ గుళికలు వేసుకోవాలి. ఆకుమచ్చ నివారణకు డైమిథియేట్‌ మరియు కార్బండయిజమ్‌ లేదా ప్రోపికోనాజోల్‌ను పిచికారీ చేసుకోవాలి.

160-200వ రోజు : వారం వారం నీటితడులు ఇవ్వాలి. అవసరమైతే సూక్ష్మధాతు పోషకాలు పిచికారీ చేయాలి. 

210-270వ రోజు : ఆకులు పసుపు రంగుకు మారడం, ఒకవైపునకు వాలిపోవడం లక్షణాలను గమనించి కోత మొదలు పెట్టాలి.


పసుపు రకాలు

దుగ్గిరాల ఎరుపు రకం : కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రం నుంచి విడుదలైన తెలంగాణ నల్లరేగడి నేలలకు అనువైన రకం.

ప్రగతి ఏసీసీ-48 రకం : ఇది కేరళ రాష్ట్రం నుంచి విడుదలై తెలంగాణకు అనుకూలించే రకం.

ఏసీసీ-79 రకం : ఇది కేరళ రాష్ర్టానికి చెందినది. తెలంగాణలో విపరీతంగా ఆదరణ పొందిన రకం.

రాజేంద్ర సోనియా రకం : ఇది బీహార్‌ రాష్ర్టానికి చెందినది. అత్యధిక దిగుబడి రావడంతో తెలంగాణలో ఆదరణ పొందింది. 

రాజేంద్ర సొనాలి రకం : ఇది బీహార్‌ రాష్ర్టానికి చెందినది. తెలంగాణలో అనుకూలమైన వంగడం.

ఎన్‌డీహెచ్‌-79 రకం : ఇది ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టానికి చెందినది. ఇది కూడా తెలంగాణలో అనుకూలమైన వంగడం.

విత్తనశుద్ధి : విత్తే ముందు పసుపుదుంపలను లీటరు నీటికి 3 గ్రాముల రిడోమిల్‌ ఎం.ఆర్‌ మరియు 2 మిల్లీ లీటర్లు మోనోక్రోటాపాస్‌ మందును కలిపి కడాయిలో ద్రావణం తయారు చేసుకోవాలి. ఈ ద్రావణంలో విత్తనాన్ని 45 నిముషాలు ముంచి విత్తనశుద్ధి చేసుకోవాలి. తరువాత ట్రైకోడెర్మా వీరిడ్‌ అనే శిలీంధ్రనాశినితో విత్తనాన్ని శుద్ధి చేసుకుని నాటితే మంచిది. 

బెడ్‌ పద్ధతి : 20 సెంటీ మీటర్ల ఎత్తుతో మడులు తయారు చేసుకోవాలి. మడికి మడికి మధ్య దూరం 30 సెంటీ మీ టర్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతి బె డ్డు రెండు నుంచి నాలుగు సాళ్లు వచ్చే లా చూసుకోవాలి. సాలుకు సాలుకు మధ్య 30 సెంటీ మీటర్ల దూరం ఉండే లా చూసుకోవాలి. విత్తన కొమ్ములను 15 సెంటీ మీటర్ల దూరంలో నాటుకోవాలి. ఈ పద్ధతి ద్వారా దుంపలు మం చిగా ఊరి దుంపకుళ్లు ఆశించదు. 20 నుంచి 30 శాతం అధికదిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి.