బుధవారం 03 జూన్ 2020
Nizamabad - Feb 23, 2020 , 03:32:41

డీసీసీబీ నోటిఫికేషన్‌ విడుదల

డీసీసీబీ నోటిఫికేషన్‌ విడుదల

నిజామాబాద్‌ సిటీ : జిల్లాలో కేంద్ర సహకార బ్యాంకు చైర్మ న్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక కోసం తేదీ ఖరారైంది. ఈ నెల 28న డైరెక్టర్ల ఎన్నిక, 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాలను దాదాపు కైవసం చేసుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా కేంద్ర మార్కెటింగ్‌ సమాఖ్య(డీసీఎంఎస్‌)లో జెండా ఎగరేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. రెండింటిల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులు చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నది. 


25న నామినేషన్లు..

డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ ఎన్నికల కోసం శనివారం జిల్లా సహకార శాఖ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గురువారమే ప్రభుత్వం ఈ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అదే రోజు స్క్రూటినీ, ఉప సంహరణ నిర్వహిస్తారు. డీసీసీబీకి 20 డైరెక్టర్‌ స్థానాలుంటాయి. ఇందులో పీఏసీఎస్‌ చైర్మన్లు 16 మంది ఉంటారు. మరో నలుగురు ఇతర కులవృత్తుల సంఘాల నుంచి పోటీ చేస్తారు. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాలు మొత్తం 10 ఉంటాయి. ఇందులో ఆరుగురు సొసైటీ చైర్మన్లు డైరెక్టర్‌ స్థానాల కోసం పోటీ చేస్తుండగా.. మరో నలుగురు ఇతర సంఘాల నుంచి బరిలో ఉంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎన్నికలు కావడంతో 144 సొసైటీ చైర్మన్లు ఈ డైరెక్టర్‌ స్థానాల ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ డీసీసీబీ డైరెక్టర్‌ స్థానాల కోసం డీసీసీబీలోని కొత్త భవనం.. డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాల కోసం డీసీఎంఎస్‌ కార్యాలయ భవనంలో ఉంటుంది. ఈ నెల 28న ఎన్నికలు రెండింటికీ నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


29న చైర్మన్ల ఎన్నిక..

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఈ నెల 29న ఎన్నుకోనున్నారు. డైరెక్టర్లుగా ఎన్నికైన అభ్యర్థులు వీరిని ఎన్నకోనున్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఉదయం 8.30 గంటల నుంచి 9.00 గంటల వరకు జరుగుతుంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎంపికకు సంబంధించి సీఎం కేసీఆర్‌ సీల్డ్‌ కవర్‌లో పేర్లను పంపనున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహులంతా తమతమ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులతో ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. 


logo