చందూర్, నవంబర్ 24 : మండల కేంద్రంలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకున్నది. తమ కుమారుడు బాగా చదువుకొని ప్రయోజకుడవుతాడని, తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని కలలు కన్న తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థి షేక్ మూసా (16) అనారోగ్యం, తన ఆధార్ అప్డేట్ చేయించుకునేందుకు సెలవులపై ఈనెల 21న నిజామాబాద్ జిల్లా కేంద్రలోని ధర్మపురిహిల్స్లోని తన ఇంటికి వెళ్లాడు.
తిరిగి ఆదివారం ఉదయం పాఠశాలకు వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన నైట్ వార్డెన్ వెంటనే ప్రిన్సిపాల్‌కు విషయాన్ని చేరవేయగా.. ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమర్టం నిమిత్తం నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విద్యార్థి తండ్రి అబ్దుల్ హమీద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఇన్చార్జి ఎస్సై రాజు తెలిపారు.