నిజామాబాద్ క్రైం, జనవరి 10: సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయకులే లక్ష్యంగా చేసుకొని బురిడీ కొట్టిస్తున్నారు. మాటల గారడీ చేసి ఖాతాలు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మాటున కుచ్చు టోపీ వేస్తున్నారు. అభయహస్తం ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తుదారులంతా మహిళలే కావడంతో సైబర్ నేరగాళ్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మాయమాటలు చెప్పి బ్యాంకు ఖాతాలోని డబ్బులను కాజేసేందుకు వల వేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.
నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్ధీపూర్ గ్రామానికి చెందిన లావణ్య అనే మహిళకు గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసింది. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, మీరు చేసుకున్న రేషన్‌కార్డు దరఖాస్తులో తప్పులు ఉన్నాయంటూ మాట కలిపింది. వాటిని సరిచేయాలంటే మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని చెప్పాలంటూ అడగడంతో లావణ్య అందుకు అంగీకరించి ఫోన్‌కు వచ్చిన ఓటీపీని చెప్పింది. దీంతో డిచ్పల్లి ఎస్బీఐ బ్యాంక్‌లో ఉన్న ఆమె ఖాతాలోంచి రూ.10వేలు డ్రా చేసినట్లుగా మెస్సేజ్ వచ్చిందని లావణ్య చెప్పింది.
నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్‌కు చెందిన మరో మహిళకు సైతం గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసింది. మీ వివరాలు చెప్పండి అంటూ అడగడంతో దరఖాస్తు చేసుకున్న మహిళ వెంటనే కాల్ కట్ చేసింది. మళ్లీ ఐదు నిమిషాలకు కాల్ చేసి అదే తరహాలో వివరాలు అడగగా, దరఖాస్తుదారు కాల్ కట్ చేసింది. కొద్ది క్షణాల్లోనే మూడోసారి ఫోన్ రావడంతో సదరు మహిళను గట్టిగా నిలదీసింది. దీంతో ఆ అపరిచితురాలు కాల్ కట్ చేసిందని దరఖాస్తుదారు తెలిపింది.