ఖలీల్‌వాడి, అక్టోబర్ 20 : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దవాఖానలోని వైద్యులు 24 గంటల్లో 10 మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ వివరాలను వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి చొరవతో దవాఖానలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. ఇందులో భాగంగా మూడు నెలల క్రితం మో కాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 60 మందికి ఆపరేషన్లు నిర్వహించగా ఒక్క రోజులోనే 10 మందికి సర్జరీలు చేశామన్నారు.

ఈ ఆపరేషన్ ప్రైవేటు దవాఖానల్లో చాలా ఖర్చుతో కూడుకున్నదని.. రూ. 3-4 లక్షల వరకు అవుతుందన్నారు.దీనికి అవసరమైన ఇంప్లాంట్స్ సుమారు రూ.75వేల వరకు ఉంటుందని వివరించారు. అలాంటిది ఈ శస్త్ర చికిత్స ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా చేస్తున్నామన్నారు. ప్రజలందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిశ్చార్జ్ అయి వెళ్లిన తర్వాత వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా నైపు ణ్యం కలిగిన ఫిజియోథెరపిస్ట్‌తో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాకు ధన్యవాదాలు తెలిపారు. శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఎముకల విభాగాధిపతి డి.నాగేశ్వరరావు, వైద్యులు పిఎల్.శ్రీనివాసరావు, కిరణ్, నవీన్, గవాస్కర్, ఎం.కిరణ్మయి బృందాన్ని అభినందించారు. స మావేశంలో వైద్యులు నాగేశ్వరరావు, ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్, డాక్టర్ గవాస్కర్, డాక్టర్ నవీన్, నర్సింగ్, సిబ్బంది పాల్గొన్నారు.