ఖలీల్‌వాడి/ డిచ్పల్లి (ఇందల్వాయి), ఏప్రిల్ 1 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడం నిలిపివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
జిల్లా కేంద్రం లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ మాట్లాడుతూ వన్యప్రాణులను కాపాడాల్సిన ప్రభుత్వమే బుల్డోజర్లతో జంతువులను హింసించడం సరికాదన్నారు. పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు హెచ్‌సీయూ భూముల వేలంపై సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించకపోతే వెంటనే రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లను వెనక్కి పంపించి, 400 ఎకరాలను తిరిగి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అప్పగించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దినేశ్, నగర అధ్యక్షుడు ఆజాద్, నాయకులు రాజు, కిరణ్, రాహుల్, అభి, మనీశ్ పాల్గొన్నారు.
హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఆపివేయాలని, వెంటనే ఆ భూములను యూనివర్సిటీ యాజమాన్యానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలుపుతూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీపై కక్ష కట్టిందని, వాటి భూములను కాజేసి తన అనుయాయులకు అప్పగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు.
ఒక రియల్ఎస్టేట్ బ్రోకర్ సీఎం అయితే ఏ విధంగా ఉంటుందో తన చర్యల ద్వారా రేవంత్‌రెడ్డి చూపిస్తున్నాడని మండిపడ్డారు. వర్సిటీ భూములను ప్రభుత్వం వేలం వేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అత్యుత్సాహంతో లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌సీయూ భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షులు తరుణ్, సమీర్, అజయ్, నాయకులు అశోక్, రాము, పృథ్వీ, అనిల్, నరేందర్, శివ, అశ్విత్, హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
కామారెడ్డి, ఏప్రిల్ 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం నిలిపివేయాలని కోరుతూ హైదరాబాద్‌కు తరలివెళ్లడానికి సిద్ధమవుతున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కామారెడ్డిలో మంగళవారం తెల్లవారు జమున ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్‌తో పాటు విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అక్రమ అరెస్టుపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.