నిజామాబాద్, జూలై 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన కృషి కార్యరూపంలోకి రానుంది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో పడిన బీజం నేడు ఫలితాలు ఇవ్వబోతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఒక్కటీ లేదు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు అంతా కలిసి గతంలోనే కేసీఆర్‌ను కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకై నిర్ణయం కూడా తీసుకున్నారు. మంచి సమయాన్ని చూసుకుని ప్రకటన చేద్దామనుకునేలోపే సర్కారు మారిపోయింది. దీంతో ప్రతిపాదన కాస్తా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే అటకెక్కినట్లు అయ్యింది. తెలంగాణ యూనివర్సిటీలోనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సర్కారు తీవ్రంగా యోచించింది.
ఇందుకోసం హైదరాబాద్‌లోని జవహార్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ)తోనూ టీయూ ఉన్నతాధికారులంతా సంప్రదింపులు జరిపారు. జేఎన్టీయూ బృందం సైతం జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం అత్యంత అనుకూలమని తేల్చింది. సరిగ్గా ఎన్నికలు ముంచుకు రావడం, అంతలోనే ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చేయడంతో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ అంశం అటకెక్కింది. బీఆర్ఎస్ సర్కారు మూడోసారి ఏర్పాటైతే 2024 ఆరంభంలోనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపితమయ్యేది.
బీఆర్ఎస్ కృషి ఫలితమే…
కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఇంజనీరింగ్ కాలేజీ ప్రతిపాదన మూలకు చేర్చబడింది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డిలు ఇంజనీరింగ్ కాలేజీ కోసం ఎంతగానో పాటుపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరిన తర్వాత వెనువెంటనే ఈ నిర్ణయం అమలు చేయాలని ప్రజలంతా కోరారు. కానీ బీఆర్ఎస్ నేతలకు పేరు వస్తుందనే కుట్రతో జాప్యం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం వాయిదాకే మొగ్గు చూపారు. మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీని కామారెడ్డి జిల్లాలోని జంగంపల్లి సౌత్ క్యాంపస్‌కు తరలించాలని షబ్బీర్ అలీ సైతం ప్రయత్నాలు చేశారు. దీంతో ఈ ప్రక్రియ ఒకడుగు ముందుకు పది అడుగులు వెనక్కు అన్నట్లుగా మారింది. ఇప్పటికే రెండు సార్లు విద్యా సంవత్సరాలు పూర్తి అయ్యాయి.
ఇంజనీరింగ్ అభ్యసించాలనుకునే వారికి శరాఘాతం అవుతుండటంతో తప్పని పరిస్థితుల్లో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలతను వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. 2024-25లోనే ఏర్పాటు చేసి ఉంటే ఇప్పటికే మౌళిక సదుపాయాల కొరత కాసింత తీరేది. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం కావడం ఇప్పటికీ ఇంజనీరింగ్ విద్యలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ సంవత్సరమే కాలేజీని ప్రారంభించాలని జిల్లా ప్రజలంతా కోరుతున్నారు. జాప్యమైనప్పటికీ బీఆర్ఎస్ నేతల కృషి ఫలించడం, బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ ఎట్టకేలకు జై కొట్టడంతో ఆశావాహులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు
కేసీఆర్ హయాంలోనే టీయూ బలోపేతం…
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్, కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లు కేసీఆర్ పాలన కాలంలోనే బలోపేతం అయ్యాయి. సకల వసతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కల్పించింది. శాశ్వత బిల్డింగ్‌లను నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. పరిశోధనకు అనుగుణంగా మౌళిక సదుపాయాలను తీర్చిదిద్దింది.
గతంలో సౌత్ క్యాంపస్ అంటే సీటు వచ్చినప్పటికీ చదువుకునేందుకు విద్యార్థులకు సరైన వసతి లేక వెనుతిరిగి వెళ్లేది. వసతి గృహాలను అధునాతనంగా నిర్మించి ఆయా బ్రాంచ్‌లకు అనుగుణంగా ప్రత్యేకంగా బిల్డింగ్‌లను తీర్చిదిద్దారు. డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌కు ధీటుగా సౌత్ క్యాంపస్ సైతం కేసీఆర్ పరిపాలనలోనే సుందరంగా మారింది.
ఇలా ఉన్నత విద్యకు బాటలు వేసినట్లే ఇంజనీరింగ్ విద్యకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా పట్టుబట్టారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జేఎన్టీయూ అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించాలని ప్రతిపాదించి కేసీఆర్ ముందుకు తీసుకెళ్లగా సమ్మతి లభించింది. ఎన్నికల కోడ్‌తో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు నిలిచినప్పటికీ పలు విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మేధావుల సలహాలు, సూచనలతో తిరిగి పాత ప్రతిపాదన జీవం పోసుకుంటోంది.
లోటు తీరనుంది…
తెలంగాణ యూనివర్సిటీలో ప్రస్తుతం 31 కోర్సులతో వేలాది మందికి టీయూ విద్యను అందిస్తోంది. డిచ్పల్లి మండలంలోని సుద్దాపల్లి, నడిపల్లి గ్రామ శివారులో మొత్తం 577 ఎకరాల్లో తెలంగాణ యూనివర్సిటీ నెలకొని ఉంది. యూనివర్సిటీ విస్తరణ దృష్ట్యా ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించగా కాంగ్రెస్ సర్కారు సైతం అనుకూలంగా నిర్ణయం తీసుకోక తప్పడం లేదు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీని ఉన్నతీకరణ చేసే ఆలోచనను సర్కారు చేసింది. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో స్థలాల కొరత ఉంది. ఖాళీ ప్రదేశం రోజురోజుకు వివిధ అవసరాల రీత్యా నిర్మితమైన బిల్డింగ్‌లతో కుచించుకు పోయింది. ఈ పరిస్థితిలో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ఉన్నతీకరణ చేస్తే కొత్తగా బిల్డింగ్ నిర్మాణాలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.
ఈ పరిస్థితిలో టీయూలోనే ప్రత్యేకంగా జేఎన్టీయూ అనుబంధంగా ఇంజనీరంగ్ కాలేజీ వచ్చేందుకు అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదనే లోటు కొన్నేళ్లుగా ఈ ప్రాంత వాసులను ఎంతగానో వేధిస్తోంది. టీయూలో అనేక వినూత్న, అధునాతన కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విద్యకు మాత్రం చోటు లేకుండా పోయింది. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో పుష్కలంగా భూమి ఉంది. జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉండటం కలిసి వస్తోంది.