కామారెడ్డి, జూలై 13 : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు..రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు.
విద్యార్థుల సంక్షేమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నాడని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.11 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పట్టణంలోని అన్ని కళాశాలల విద్యార్థులతో కలిసి కొత్త బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు సంజయ్, నియోజకవర్గ ఇన్చార్జి సమీర్ ఖాన్, మోహన్, భరత్, ధనుష్, అఖిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.