తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతున్నదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అందుకే దేశప్రధానిగా కేసీఆర్‌ను చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. వేల్పూర్ మండలంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. వేల్పూర్‌లో రూ.15కోట్లతో చేపట్టనున్న హైలెవల్ బ్రిడ్జి, పడగల్లో రూ.2కోట్లతో నిర్మించనున్న వంతెన పనులను వేముల ప్రారంభించారు.
వేల్పూర్, ఫిబ్రవరి 22: తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతా జరగాలనే ఆకాంక్షతో కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో రూ.15 కోట్లతో చేపట్టనున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులతోపాటు మండలంలోని పడగల్ గ్రామంలో రూ.2కోట్లతో బ్రిడ్జి, రూ.64లక్షలతో నవాబ్ చెరువు పునరుద్ధరణ, రూ.15 లక్షలతో సీసీ డ్రైనేజీ, రూ.10లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, హనుమాన్ నగర్లో రూ.20లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవన నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేల్పూర్‌లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి దేశం అబ్బుర పడుతున్నదని అన్నారు. మహారాష్ట్రలోని 14 గ్రామాలకు చెందిన సర్పంచులు తమ గ్రామాలను తెలంగాణలో కలుపాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందించారని గుర్తుచేశారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు ఎమ్మెల్యే కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ కూడా అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. లేకపోతే తన నియోజకవర్గాన్ని తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేశారంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేవలం మూడేండ్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాళేశ్వరం జలకళను చూసి ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోతున్నాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా కోటి కుటుంబాలకు ఇంటింటికీ కుళాయిలు అమర్చి శుద్ధ జలాలను అందిస్తున్నామని తెలిపారు. అతి తక్కువ జనాభా కలిగి ఉండి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం సాధ్యంకాని పనులను కేసీఆర్ ప్రభు త్వం చేసి చూపించిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కు అండగా ఉండాలని కోరారు.
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పరిశీలన కోసం ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధుల బృం దాలు తెలంగాణలో పర్యటిస్తూ, ఇక్కడ ప్రగతిని చూసి ఆశ్చర్య పోతున్నాయన్నారు. అభివృద్ధి పథంలో మన రాష్ట్రం దూసుకుపోతూ దేశంలోనే నంబర్వన్నగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, జడ్పీటీసీ అల్లకొండ భారతి, సర్పంచులు తీగల రాధ, ద్యావతి వర్షిణి, రేగుల్ల రాములు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.