నాగిరెడ్డిపేట్/ఏర్గట్ల, అక్టోబర్ 10: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ములేక కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. చెల్లని జీవోతో చిల్లర రాజకీయం చేస్తూ, బడుగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు. నాగిరెడ్డిపేట, ఏర్గట్ల మండల కేంద్రాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెచ్చిన జీవో నంబర్ 9 చెల్లదని హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇది సీఎం రేవంత్‌రెడ్డి ఆడిన డ్రామా అని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ముందే తెలిసినా బీసీ రిజర్వేషన్ల పెంపుతో 50శాతం దాటుతుందని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని తెలిపారు. రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేసే అధికారం రాష్ట్ర క్యాబినెట్‌కు లేదని, ప్రత్యేక జీవో ఇచ్చి బీసీలను నిట్టనిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. జీవో నంబర్ 9తో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా నామినేషన్ వేయలేదని తెలిపారు. అంటే జీవో నంబర్ 9 చెల్లదని ఆ పార్టీకి ముందే తెలుసన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని గ్రహించిన ప్రభుత్వం.. ఎన్నికలను నిర్వహించక, రిజర్వేషన్ల పేరుతో కాలాయాపన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు బీసీలను మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఏర్గట్ల మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం అన్నారు. బీసీలకు 42 శాతం శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. చట్టబద్ధత లేకుండానే ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు. కులగణన తప్పుల తడకగా చేపట్టారని, ఆ రిపోర్టులను ఇప్పటివరకు బహిర్గతం చేయలేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకొని.. బీసీల మోచేతికి బెల్లం పెట్టి మోసం చేస్తున్నదని అన్నారు. బీసీల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కాలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. నాగిరెడ్డిపేట సమావేశంలో సీనియర్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య, నాయకులు మోతె శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, కృష్ణ, సాయిబాబా, కాంత్‌రెడ్డి, నరేశ్, దుర్గేశ్, మంగలి యాదగిరి, గడ్డమీది దుర్గయ్య, ఫరీద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్లలో మాజీ ఎంపీటీసీ మధు, సొసైటీ చైర్మన్ చిన్న నర్సయ్య, నాయకులు నర్సయ్య, జైనుద్దీన్ పాల్గొన్నారు