భోగభాగ్యాల భోగి..

- నేటి నుంచి సంక్రాంతి వేడుకలు
వాకిళ్లలో సప్తవర్ణాల రంగవల్లులు.. మధ్యన ముచ్చట గొలిపే గొబ్బెమ్మలు.. లోగిళ్లలో బసవన్నల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలు.. ఆకాశాన ఎగిరే పతంగులు.. భోగిపండ్లు.. పిండివంటల ఘుమఘుమలు.. చిన్నాపెద్దా సందడితో సంబురాల సంక్రాంతికి ప్రతి పల్లే ముస్తాబైంది. ఎక్కడెక్కడి నుంచో చేరుకున్న బంధువులతో ప్రతి ఇల్లూ కళకళలాడుతున్నది. ముచ్చటైన ఈ మూడు రోజుల పండుగలో నేడు భోగిని వైభవంగా జరుపుకునేందుకు ప్రజానీకం సిద్ధమైంది.
సకలజనులు సిద్ధం
బుధవారం భోగి పండుగను జరుపుకునేందుకు సకల జనులు సిద్ధమయ్యారు. మనం నిర్వహించుకునే ప్రతి పండుగ లోనూ, చేసే ప్రతి పూజలోనూ ఏదో ఒక పరమార్థం దాగి ఉంటదన్నది సత్యం. దక్షిణాయణం చివరి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. దీంతో సూర్య రశ్మి తగినంత ఉండక, క్రిమి కీటకాలు నశించవు.. ఈ క్రమంలోనే మహిళలు పెండ (పేడ) నీళ్లతో ఇళ్లన్నీ అలికి శుభ్రం చేసి సుద్ద లేదా బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. వీటి ప్రభావంతో క్రిమి కీటకాలు నశిస్తాయి. ముగ్గుల మీద పెండ ముద్దలుంచి, పసుపు కుంకుమలు పెట్టి బంతి, చామంతి మొదలైన పూలతో అలంకరి స్తారు. వీటినే గొబ్బెమ్మలు అంటారు. వేకువ జామునే హరిదాసుల హరినామస్మరణ, గంగిరెద్దుల విన్యాసాలు, వైష్ణవాలయాల్లో విష్ణు సహస్ర నామ పారాయణాలు వీనులవిందు చేస్తాయి. భోగి రోజు గోదాదేవి కల్యాణం కమనీయంగా జరిపిస్తారు.
సూర్యారాధన
సూర్యుడు ఆది పురుషుడు, అందుకే సూర్య నారాయణ మూర్తి అంటారు. ఆది కాలం నుంచి మానవుడు భానుడిని ఆరాధి స్తున్నాడు. సూర్యుడు ప్రతి నెలా ఒక రాశిలో సంచరిస్తాడు. కర్కాటకం నుంచి ధనస్సు వరకు గల ఆరు రాశులను దాటి మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం. కర్కాటకం నుంచి ధనస్సు వరకు సూర్య సంచార కాలం దక్షిణాయనం అంటారు. సూర్యుడు మకర సంక్రమణం చెందే సమయం పవిత్ర మైంది. అంతకంటే ముందు భోగి పండుగ జరుపుకుం టారు. పురాతన పరంపర నుంచి కొత్త దనంలోకి పరిణితి చెందడమే సంక్రమణం. దక్షిణాయనంలో చేసిన పాపాల న్నీ గుట్టగా పోసి కాలపెడితే, పుణ్యకాలమైన ఉత్తరాయణం ఉత్తమ జీవితం ఇస్తుందని నమ్మకం. పాత వ్యవస్థలోని చెడును మంటల్లో కాల్చి, సజీవ తత్వాన్ని గ్రహించి, గుణాత్మక పరివర్తనం చేయడమే భోగి మంటలు.
సిరుల భోగి ..
దక్షిణాయణం దేవతలు నిద్రించిన కాలం కావడంతో సంక్రాంతికి ఒక రోజు ముందు పీడ నివారణకు ఇంట్లోని పురాతన వస్తువులను భోగి మంటల్లో ఆహుతి చేస్తారు. ఈ రోజు నుంచి కొత్త వస్తువులు ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. భోగి రోజున తెల్లవారు జామున పిల్లలకు తలారా స్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, అక్షింతలు కలిపి వారి తలలపై పోయడం ద్వారా దృష్టి దోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. భోగి పండ్లను పెద్దల చేత పోయించడం వల్ల చిన్నారుల ఆయుష్షు పెరుగుతందని ప్రతీతి. భోగి రోజే గోదాదేవి రంగనాథస్వామిని వివాహమాడింది. అప్పటి నుంచే ఆమె భోగభాగ్యాలు పొందిందని ప్రతీతి. భోగి రోజు మహిళలు వాకిళ్లను రంగు రంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడుతారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, పళ్లు పోస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి తమ ఇళ్లలోకి వస్తుందని నమ్ముతారు.
కోడి పందేలకు సైద
హెగాం, జనవరి 12 : సంక్రాంతి వస్తుందంటే కోడి పందేలకు పందెంరాయుళ్లు సిద్ధం అవుతారు. పండుగకు పక్షం రోజుల ముందు నుంచే బెట్టింగులు కాస్తూ ఆడుతారు. ఈ పందేల కోసం స్థానికంగా దొరికే నాటు పుంజులతోపాటు కొలంగి, ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా రూ.20 వేల నుంచి రూ.50 వేలు పెట్టి పుంజులను కొనుగోలు చేస్తారు. వీటికి వేడినీళ్ల స్నానం, బాదం, జీడిపప్పు, పసందైన విందు భోజనం పెడతారు. బావుల్లో ఈత కొట్టించడం, రన్నింగ్ చేయించడం వంటివి చేయిస్తారు. రోజుకు రూ.25-రూ.35 ఖర్చు చేస్తారు. నెలకు దాదాపు రూ.800-రూ.1000 ఖర్చు చేస్తారు. ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ప్రత్యర్థి కోడిని ఓడించేందుకు ప్రత్యేక తర్ఫీదు కూడా ఇస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పందేలు జరుగుతుండగా.. ప్రధానంగా కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని చౌక, హత్తిని, గిరివెల్లి, ఖర్జీ రాంపూర్, గొర్రెగుట్ట గ్రామాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయి. ఇంకా స్థానికులు మహారాష్ట్ర లోని దేవులమర్రి, హైరి వంటి ప్రాంతాలకు వెళ్లి పందేలుకాస్తారు. సరదా కోసం పందేలు కాస్తూ వేల రూపాయల బెట్టింగ్ కాస్తారు. పోలీసులు కోడి పందేలను అడ్డుకుంటున్నప్పటికీ, ఏదో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి.
ఆంధ్రాకు ప్రత్యేక సర్వీసులు
- ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్టాండ్
నిర్మల్ అర్బన్,జనవరి 12: సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులతో నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఏపీలోని కనిగిరి, పామూరు, ఉదయగిరి, వినుకొండకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా డిపో మేనేజర్ ఆంజనేయులు పర్యవేక్షించారు.
పతంగులతో పదిలం..!
- పొంచి ఉన్న ప్రమాదాలు
- జాగ్రత్తలు పాటిస్తేనే మేలు
నేరడిగొండ, జనవరి 12 : సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పతంగుల సందడి కనిపిస్తుంది. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఎక్కడ చూసినా పిల్లలు పతంగులు ఎగరేస్తూ కనిపిస్తున్నారు. మైదానాలు, ఖాళీ ప్రదేశాలు లేని చోట భవనాలపై ఉండి వాటిని ఎగరేస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి ప్రమాదాలకు దారితీస్తుంటాయి. తెగిన గాలిపటాలు విద్యుత్ తీగలకు చుట్టుకోవడం వల్ల, వాటిని తీసే ప్రయత్నంలో ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. కాగా, పండుగ పూట విషాదం చోటు చేసుకోకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పిల్లలు జాగ్రత్త
- పండుగ సమయంలో పిల్లలు పతంగులను ఎగరేయడం సరదా. అలాగని వారిని స్వేచ్ఛగా వదిలేయడం సరైంది కాదు. పిల్లల దృష్టి కేవలం పతంగులపైనే ఉంటుంది. వారిని గమనిస్తూ ఉండాలి.
- పిట్ట గోడలు లేని భవనాలు, చిన్న చిన్న మేడలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగరేయరాదు. పైకి చూస్తూ కింద పడిపోవచ్చు.
- రహదారులపై, గల్లీల్లో గాలిపటాలు ఎగరేయడం ప్రమాదకరం. తెగిన పతంగుల కోసం పరుగెత్తి వాహనాల కింద పడిపోవచ్చు.
- తెగిన గాలి పటాలు విద్యుత్ తీగలకు చిక్కుకుంటాయి. అలాంటి వాటిని తీసే ప్రయత్నంలో ఇనుపరాడ్లు, కర్రలతో కదిలించే ప్రయత్నం చేయవద్దు.
- పక్షులు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో ఎగరేయకూడదు. పక్షుల కాళ్లకు, రెక్కలకు దారాలు చిక్కుకుని మృతి చెందుతాయి.
- చెరువులు, కుంటలు, నాలాల దగ్గరలో పతంగులు ఎగరేయడం వల్ల అందులో పడిపోయే అవకాశముంటుంది.
- రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాకులపై పతంగులు ఎగరేయవద్దు.
- రోడ్డుపై పతంగులను ఎగరేయడంవల్ల వాహనదారుల మెడకు చుట్టుకునే అవకాశముంటుంది.
- మైదానాలు, ఆట స్థలాలు, విశాలమైన ఆరుబయట ప్రదేశాల్లో పతంగులను ఎగరేవేయడం శ్రేయస్కరం.
తాజావార్తలు
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం