బుధవారం 27 జనవరి 2021
Nirmal - Nov 13, 2020 , 02:01:16

పెద్దపులిని పట్టుకుంటాం

పెద్దపులిని పట్టుకుంటాం

  •  ప్రత్యేక బృందాలు, సీసీ కెమెరాలు, బోన్ల ఏర్పాటుకు చర్యలు
  •  సీసీఎఫ్‌ వినోద్‌కుమార్‌
  • బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే  కోనప్ప

 దహెగాం : మండలంలో దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్‌ను చంపిన పులిని త్వరలో పట్టుకుని, జూకు తరలిస్తామని అటవీ శాఖ సీసీసీఎఫ్‌(చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, సీసీఎఫ్‌ వినోద్‌కుమార్‌, రామగుండం సీపీ, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణ గురువారం దిగిడ గ్రామానికి వెళ్లి, విఘ్నేశ్‌ మృతదేహాన్ని పరిశీలించారు. కుటుం బ సభ్యులను ఓదార్చారు. ప్రత్యక్ష సాక్షులు పోర్తేటి నవీన్‌, సిడాం శ్రీకాం త్‌, గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీసీఎఫ్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ విఘ్నేశ్‌ను చంపిన పెద్దపులిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు,  సీసీ కెమెరాలు, 10 బోన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో 8 పులులు ఉన్నాయని, విఘ్నేశ్‌పై దాడి చేసింది కే8ఏఎస్‌ఎఫ్‌2 పులి అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం రామగుండం సీపీ, ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ అటవీశాఖ అధికారులకు పోలీస్‌ శాఖ నుంచి రక్షణ కల్పిస్తామని తెలిపారు. విఘ్నేశ్‌ మృతి బాధాకరమన్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం..

పెద్ద పులి దాడిలో విఘ్నేశ్‌ మృతి చెందడం బాధాకరమని, అతని కుటుంబాన్ని ఆదుకుంటామని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని, అతని తండ్రి దసురయ్యకు ఉద్యోగం కల్పించాలని కన్జర్వేటర్‌ సీపీ వినోద్‌కుమార్‌కు విన్నవించారు. ఇందుకు ఆయన స్పందించి శుక్రవారం రూ.5 లక్షల చెక్కును అందజేస్తామని,  మరో రూ.5 లక్షలు అందించేందుకు కృషిచేస్తామని తెలిపారు. మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.20 వేలను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రూ.5 వేలను జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో  అడిషనల్‌ ఎస్పీ సుధీంద్ర, డీఎస్పీ బీఎల్‌ఎన్‌ స్వామి, సీఐ నరేందర్‌, డీఎఫ్‌వో శాంతారాం, వినయ్‌కుమార్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌  సంతోష్‌గౌడ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ తిరుపతిగౌడ్‌, ఎస్‌ఆర్వో పూర్ణిమ, ఎస్‌ఐలు రఘుపతి, రామ్మోహన్‌, తదితరులు పాల్గొన్నారు. 


logo