ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Oct 04, 2020 , 01:46:59

వెండితెరపై మన అందాలు

వెండితెరపై మన అందాలు

  • షూటింగ్‌ స్పాట్‌లకు కేరాఫ్‌గా ఉమ్మడి ఆదిలాబాద్‌
  • సినీలోకాన్ని ఆకట్టుకుంటున్న జలపాతాలు, అడవులు
  • మక్కువ చూపుతున్న డైరెక్టర్లు, అగ్రహీరోలు
  • ఇప్పటికే రుద్రమదేవి, ఎమ్మెల్యే, సిల్లీఫెల్లోస్‌ సినిమాల చిత్రీకరణ
  • తాజాగా ‘పుష్ప’ యూనిట్‌ సభ్యులతో అల్లు అర్జున్‌ పర్యటన
  • ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, ఫొటో షూట్‌లు, జానపద పాటల రూపకల్పన

ఆదిలాబాద్‌ జిల్లా మినీ కశ్మీరంలా ప్రసిద్ధిగాంచింది. జాలువారుతున్న జలపాతాలు.. పచ్చని వనాలతో అలరిస్తున్న అందాలు.. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న ఎత్తయిన గుట్టలు.. ఆధ్యాత్మికతకు మారుపేరుగా నిలిచిన ఆలయాలు.. జలసోయగాలతో ప్రకృతి రమణీయతను సంతరించుకున్న జిల్లా సినీలోకాన్ని ఆకట్టుకుంటున్నది. అగ్రకథానాయకులు, డైరెక్టర్లు షూటింగ్‌లకు మక్కువ చూపుతున్నారు. కోస్తా, రాయలసీమకు దీటుగా సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి. ఇప్పటికే రుద్రమదేవి, ఎమ్మెల్యే, సిల్లీఫెల్లోస్‌ వంటి చిత్రాల షూటింగ్‌లు జరిగాయి. తాజాగా పుష్ప యూనిట్‌ సభ్యులు కూడా లొకేషన్లను పరిశీలించారు. వీటితోపాటు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, ఫొటో షూట్‌లు, జానపద పాటల రూపకల్పన జరుగుతున్నది. జిల్లాలో షూటింగ్‌లపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..

షూటింగ్‌ స్పాట్‌లకు కేరాఫ్‌గా ఆదిలాబాద్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవులు, జలపాతాలతో పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. మహబూబ్‌ఘాట్‌ అందాలు పర్యాటకులతోపాటు సినిమా దర్శకులు, పాటలు చిత్రీకరించే వారిని ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఆదిలాబాద్‌ జిల్లాలో సినిమా షూటింగులు, పాటల చిత్రీకరణ, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, జానపద పాటలు, ఫొటో షూట్‌లకు కేరాఫ్‌గా మారింది. ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా ఉన్న జిల్లా సినిమా చిత్రీకరణకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో ప్రముఖ నటీనటులు అల్లు అర్జున్‌, దగ్గుపాటి రానా, అనుష్క జంటగా తీసిన రుద్రమదేవి సినిమాలో పలు సన్నివేశాలు, పాటలు కుంటాల జలపాతం వద్ద చిత్రీకరించారు. కల్యాణ్‌రామ్‌ నటించిన ఎమ్మెల్యే సినిమా చిత్రీకరణ నిర్మల్‌, లక్ష్మణచాంద మండలాల్లో తీశారు. నాగచైతన్య తీసిన ఓ చిత్రం సోన్‌ వంతెనతోపాటు కుంటాల జలపాతం వద్ద చిత్రీకరించారు. తాజాగా ఖానాపూర్‌, నిర్మల్‌లో అర్ధశతాబ్దం సినిమా షూటింగ్‌ కూడా కొనసాగుతున్నది. ఇటీవల అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా కోసం పలు లొకేషన్లను ఎంపిక చేసేందుకు ఆదిలాబాద్‌ జిల్లా కుంటాలతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పర్యాటక ప్రదేశంతోపాటు సినిమా షూటింగ్‌లకు స్పాట్‌గా మారింది.  - నిర్మల్‌, నమస్తే తెలంగాణ

భీం జీవిత చరిత్రపై లఘుచిత్రం

కెరమెరి : గిరిజన వీరుడు, ఆదివాసుల ఆరాధ్యదైవం కుమ్రం భీం జీవిత చరిత్రపై లఘు చిత్రం రూపొందించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ డాక్యుమెంటరీని 2015లో నిర్మించారు.  హట్టి నుంచి జోడెఘాట్‌ వరకు 22 కిలోమీటర్ల దూరంలో ఇరువైపులా ఉన్న ఎత్తయిన గుట్టలు, అడవి అందాలను చిత్రీకరిస్తూ వారం రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశారు. ఆదివాసుల జీవనశైలి, పోరాటానికి దారితీసిన కారణాలు, భీం చేసిన సాహస పోరాటాలు ఎప్పటికీ గుర్తుండి పోయేలా చిత్రీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో చేపట్టిన అభివృద్ధిపైనా ప్రస్తావించారు. ఓం సాయితేజ ఆర్ట్స్‌ బ్యానర్‌పై వనబంధు కల్యాణ యోజన ద్వారా ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రానికి డీ సురేశ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు.

ఎస్‌డీ కేరాఫ్‌ వెంచపల్లి

కోటపల్లి : జిల్లా అందాలను సినీవ్యాప్తం చేసేందుకు మన మంచిర్యాలకు చెందిన దర్శకుడు ముందుకొచ్చాడు. శ్రీసాయి అమృత లక్ష్మీ క్రియేషన్స్‌లో భాను ఎంటర్‌ టైన్‌మెంట్‌ (గోదారి భానుచందర్‌)లో దర్శకుడు పాలిక శ్రీనివాసాచారి ఎస్‌డీ (శివుడు, దేవిక) కేరాఫ్‌ వెంచపల్లి సినిమాను తీస్తున్నారు. గతేడాది వెంచపల్లి, సీసీసీ నస్పూర్‌లో సినిమా షూటింగ్‌ చేశారు. వెంచపల్లి, ప్రాణహిత నది అందాలతోపాటు మంచిర్యాల జిల్లాలోని సీసీసీ, క్వారీ, సింగరేణి, గోదావరి, ప్రాణహిత పరిసర ప్రాంతాలు కోటపల్లి, చెన్నూర్‌, వేమనపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల్లో షూటింగ్‌ చేశారు. ఈ సినిమాలో హీరో శ్రీజిత్‌ లవణ్‌, ప్రముఖ విలన్‌ జీవా, సుమన్‌శెట్టి, అశోక్‌కుమార్‌, గబ్బర్‌సింగ్‌ బ్యాచ్‌తోపాటు జిల్లాకు చెందిన పలువురు నటిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్‌కి కాస్త బ్రేక్‌ పడింది. ఇప్పటికే ప్రముఖ సినిమా దర్శకుడు కే విశ్వనాథ్‌ పాటలు విడుదల చేశారు. మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది.

షూటింగ్‌లకు కేరాఫ్‌ చెన్నూర్‌

చెన్నూర్‌ టౌన్‌ : చెన్నూర్‌లోని అటవీ ప్రాంతాలు సినిమా షూటింగ్‌లకు కేరాఫ్‌గా మారాయి. కత్తెరసాల బ్రిడ్జి, అక్కెపల్లి వాగు, నర్సింహుల బండ ప్రాంతాల్లో పలు సినిమాలు చిత్రీకరిస్తున్నారు. చెన్నూర్‌ పట్టణంలోని మంగళిబజార్‌, బ్రాహ్మణవాడలో స్క్రీన్‌ప్లే, రచయిత, దర్శకుడు సిద్ధు యువన్‌ అలియాస్‌ ఇప్పనపల్లి హరీశ్‌ ఇటీవల హీర సినిమా షూటింగ్‌ చేశారు. రావుల సమ్మయ్య, తనుగుల మహేశ్‌, మల్లేశ్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్‌ చేశారు. 2016లో రుధిరం, 2017లో ఊపిరి ఆగే ఈ క్షణం వంటివి షూట్‌ చేశారు. రైతుబజార్‌, అన్నారం బ్యారేజ్‌, శివ్వారం ప్రాంతంలోని ఎల్‌మడుగు వద్ద పలు సినిమా పాటలను చిత్రీకరించారు.

బతుకమ్మ పాట చిత్రీకరణ

నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని గడిలో శనివారం బతుకమ్మ పాటను చిత్రీకరించారు. మన మంచిర్యాల బ్యానర్‌పై హరిప్రసాద్‌గౌడ్‌ సమర్పణలో దర్శకులు గాజుల సుజిత్‌కుమార్‌, శివప్రసాద్‌ గౌడ్‌, రాజేందర్‌ పాటలోని కొన్ని సన్నివేశాలను షూట్‌ చేశారు. ఈ పాటకు నిర్మాతలుగా లచ్చన్న గౌడ్‌, అశోక్‌ గౌడ్‌, తూముల వెంకటేశ్‌, సంగీత దర్శకులుగా శ్రీకాంత్‌, చికాటి సాయి, సాహిత్యం వెల్మల శ్రావణ్‌, గాయకురాలిగా నాగలక్ష్మి, కొరియోగ్రాఫర్‌గా మహేశ్వరి వ్యవహరిస్తున్నారు.

- మంచిర్యాల ఫొటోగ్రాఫర్‌

తారల విడిది నిర్మల్‌

నిర్మల్‌ అర్బన్‌ : నిర్మల్‌ జిల్లాలో తరచూ షూటింగ్‌ల సందడి నెలకొంటున్నది. చిత్రీకరణకు చక్కని ప్రదేశాలు, బస చేయడానికి అనువైన హోటళ్లు ఉండడంతో సినీ యూనిట్‌ సభ్యులు షూటింగ్‌లకు వస్తున్నారు. కుంటాలలో రుద్రమదేవి సినిమా షూటింగ్‌ సందర్భంగా ప్రొడక్షన్‌ సిబ్బందితోపాటు రానా, అనుష్క నిర్మల్‌లోని మయూరి హోటల్‌లో బస చేశారు. ఆ తర్వాత కల్యాణ్‌రామ్‌, కాజల్‌ జంటగా నటించిన ఎమ్మెల్యే, అల్లరి నరేశ్‌, సునీల్‌ కలిసి నటించిన సిల్లీఫెల్లోస్‌, సంపూర్ణేశ్‌ బాబు నటించిన కొబ్బరి మట్టతో పాటు, తీర్థ సినిమాలు షూటింగ్‌ ఇక్కడే జరిగాయి. బత్తీస్‌గఢ్‌ షార్ట్‌ ఫిలిం, నాగబాల సీరియల్‌లో అనేక సన్నివేశాలను జిల్లాలోనే చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లాలో అర్ధశతాబ్దం సినిమా షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. నిర్మల్‌ పట్టణంలోని గండిరామన్న ఆలయం, ఖానాపూర్‌, వడ్యాల్‌ గ్రామాల్లో పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కేరాఫ్‌ కంచెరపాలెం హీరో కార్తిక్‌తో పాటు సినీ ఇండస్ట్రీకి తొలి పరిచయంగా కృష్ణప్రియ నటిస్తున్నారు. ఆమెకు తండ్రిగా సీనియర్‌ నటుడు సాయికుమార్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

 పక్షం రోజుల షూటింగ్‌ ఇక్కడే..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అందాల గురించి అందరూ చెబుతుంటే విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. అర్ధశతాబ్దం సినిమా షూటింగ్‌ను ఇక్కడే పక్షం రోజులపాటు చిత్రీకరించాలని నిర్ణయించాం. ఇది నా మొదటి సినిమా. ప్రస్తుతం కార్తీక్‌తోపాటు కృష్ణప్రియ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక్కడి ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు.     - రవి, అర్ధశతాబ్దం దర్శకుడు

 టిక్‌ టాక్‌ నుంచి సినిమా రంగానికి.. 

మాది కేరళ రాష్ట్రంలోని హరిపురం గ్రామం. నేను బీఎస్సీ నర్సింగ్‌ చేస్తున్నా. సినిమాలో నటించాలన్నది నా కల. టిక్‌టాక్‌లో 230 వీడియోలు చేశా. 1.5 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. మొదటిసారిగా సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఈ ప్రాంతం చాలా బాగుంది. భాష పరమైన సమస్య ఉన్నా.. హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నా. భవిష్యత్‌లో సినిమా రంగంలో రాణించడమే నాలక్ష్యం.

- కృష్ణ ప్రియ, అర్ధశతాబ్దం సినిమా హీరోయిన్‌.

ఖానాపూర్‌లో ‘అర్ధశతాబ్దం’

షూటింగ్‌లో పాల్గొంటున్న సీనియర్‌ నటుడు సాయికుమార్‌

ఖానాపూర్‌ : ఖానాపూర్‌ పట్టణంలోని శ్రీరాంనగర్‌లో శుక్రవారం రాత్రి ‘అర్ధశతాబ్దం’ సినిమా షూటింగ్‌ చేశారు. సీనియర్‌ నటుడు సాయి కుమార్‌పై ఒక విప్లవాత్మక సన్నివేశం చిత్రీకరించారు. ఈ చిత్రంలో కార్తీక్‌, కృష్ణప్రియతోపాటు ఆమని, నవీన్‌చంద్ర, ఫిదా ఫేం శ్రావణి నటిస్తున్నారు

షూటింగ్‌ స్పాట్‌ @ కుంటాల

ఇప్పటికే పలు సినిమాల చిత్రీకరణ

రుద్రమదేవి కీలక భాగం ఇక్కడే..

బతుకమ్మ, జానపద గీతాలతో షార్ట్‌ఫిలిమ్స్‌

ఇటీవల ‘పుష్ప’ యూనిట్‌ సందర్శన

నేరడిగొండ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కుంటాల జలపాతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి పచ్చని చెట్లు, ఎత్తయిన కొండల నుంచి జాలువారుతున్న నీరు పర్యాటకుల మనసును దోచేస్తాయి. అందుకే ఈ జలపాతం సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. 2013 నవంబర్‌లో రుద్రమదేవి సినిమా షూటింగ్‌ నిర్వహించారు. హీరో దగ్గుబాటి రానా, హీరోయిన్‌ అనుష్కలపై పలు సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు. ఈ జలపాతాన్ని చూసిన వీరిద్దరూ మంత్రముగ్ధులయ్యారు. ఆ తర్వాత కూడా పలు చిన్న సినిమాలు, లఘు చిత్రాలు, జానపద గీతాల చిత్రీకరణకు కుంటాల జలపాతం షూటింగ్‌ స్పాట్‌గా మారింది. ఇటీవల ’పుష్ప’ సినిమాకు సంబంధించి కూడా హీరో అల్లు అర్జున్‌, యూనిట్‌ సభ్యులు, నిర్మాత దిల్‌రాజు జలపాతాన్ని సందర్శించారు. త్వరలోనే ఇక్కడ షూటింగ్‌ నిర్వహించనున్నట్లు సమాచారం

ఏజెన్సీలో పాటల చిత్రీకరణ

ఉట్నూర్‌ : ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌ డివిజన్‌ ప్రాంతంలో దట్టమైన అడవితోపాటు జలపాతాలు అనేకం ఉన్నాయి. దీంతో యువత పలు షార్ట్‌ ఫిలింలు, డాక్యుమెంటరీలు తీస్తున్నారు. ఈ ప్రాంతం పాటల చిత్రీకరణకు అనుకూలంగా ఉండడంతో, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మండల కేంద్రంలోని యువకుడు, డైరెక్టర్‌ సూర్య హైదరాబాద్‌కు చెందిన యువతి రాజేశ్వరి, ఉట్నూర్‌కు చెందిన బొడ్డు హరీశ్‌తో కలిసి ‘విడిచి పెట్టి వెళ్లిపోతివే’ లవ్‌ ఫెయిల్‌పై సాంగ్‌ను స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో చిత్రీకరించాడు. దీనికి మంచి గుర్తింపు లభించింది. మండల కేంద్రానికి చెందిన మరో యువకుడు దుర్గాప్రసాద్‌ హీరోగా, హైదరాబాద్‌కు చెందిన యువతి హీరోయిన్‌గా ‘నీలిరంగు చీర కట్టి.. నిర్మల్‌ జాన’ అంటూ ఓ పాటను చిత్రీకరించాడు. దీనిని జిల్లాలోని కొన్ని జలపాతాలు, గోదావరి తీరమైన కలమడుగు, జన్నారం, సిరిసిల్ల ప్రాంతాల్లో చిత్రీకరించారు. పూర్తిగా పల్లె అందాలను చూపుతూ తీసిన ఈ పాట చాలా మందిని ఆకట్టుకున్నది. 

పొచ్చెర వద్ద ‘బకరా’ చిత్రీకరణ

బోథ్‌ : మండలంలోని పొచ్చెర జలపాతం వద్ద ‘బకరా’ సినిమాను చిత్రీకరించారు. రూషల్‌ మూవీస్‌ పతాకంపై సీఎస్‌ఆర్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో ప్రదీప్‌, హిశిక హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమాలోని ‘జూంబాబ.. జూంబాబ’ పాటను ఇక్కడే చిత్రీకరించారు. నిర్మాత, కో నిర్మాతలుగా సీహెచ్‌ శివరామకృష్ణ, అప్పాల కోటేశ్వర్‌రావు, సంగీత దర్శకుడు రోహిత్‌ ఆర్‌ కులకర్ణి షూటింగ్‌లో పాల్గొన్నారు. 2013 మార్చి 22న సినిమాను విడుదల చేశారు. అప్పట్లో ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ జలపాతం వద్ద పలు పాటలు కూడా చిత్రీకరించారు. 


logo