సోమవారం 30 మార్చి 2020
Nirmal - Feb 22, 2020 , 03:14:42

పాలనలో ప్రత్యేక ముద్ర!

పాలనలో ప్రత్యేక ముద్ర!

సమూల మార్పులు తెస్తున్న జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారుల్లో బాధ్యత పెంచే దిశగా చర్యలు సమయసారిణి, పారదర్శకత పెంచేలా కృషి ప్రజావాణిలో ఆన్‌లైన్‌ విధానం అమలుఅన్ని శాఖల్లో ఈ-ఆఫీస్‌ కోసం కసరత్తు

సమూల మార్పులు తెస్తున్న జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారుల్లో బాధ్యత పెంచే దిశగా చర్యలు సమయసారిణి, పారదర్శకత పెంచేలా కృషి ప్రజావాణిలో ఆన్‌లైన్‌ విధానం అమలుఅన్ని శాఖల్లో ఈ-ఆఫీస్‌ కోసం కసరత్తు

జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముషారఫ్‌ అలీ ఫారూఖీ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. పక్షం రోజుల్లోనే పాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అధికారుల్లో మరింత బాధ్యత పెంచడంతోపాటు పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అనేక సంస్కరణలు చేపట్టారు. ఆయా శాఖల వారీగా సంబంధిత అధికారులనే బాధ్యులను చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిలో ఆన్‌లైన్‌ విధానం, అన్ని శాఖల్లో ఈ-ఆఫీస్‌ విధానం, కలెక్టర్‌ పేషీ ఏర్పాటు వంటి వాటికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పల్లె నిద్ర కార్యక్రమంతో క్షేత్ర స్థాయి సమస్యలను పరిశీలించి ప్రజలతో మమేకమయ్యారు. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

         -నిర్మల్‌ /నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి


నిర్మల్‌ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లా పాలనాధికారి ముషారఫ్‌ అలీ ఫారూఖీ పక్షం రోజుల్లోనే జిల్లా పాలనలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. పక్షం రోజుల్లోనే పాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో పారదర్శకత పాటించాలనే ఉద్దేశంతో.. సరికొత్త విధానాన్ని అమలుచేస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో స్వీకరించే కార్యక్రమానికి గత సోమవారం నుంచి ప్రారంభించారు. అర్జీలను సత్వరం పరిష్కారం చేయడంతో పాటు పారదర్శకత పెంచేందుకు ఈ ప్రక్రియను మొదలు పెట్టారు. 53శాఖలు ఉండగా.. ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉండే శాఖలపై దృష్టి పెట్టారు. రెండు శాఖలకు కలిపి ఒకటి చొప్పున కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం 23కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత కంప్యూటర్‌లో సదరు జిల్లా అధికారి నమోదు చేస్తున్నారు. అర్జీల పరిష్కారం ఏ దశలో ఉందో.. ఎక్కడికక్కడ తెలుసుకునేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతున్నది. గతంలో ప్రజా ఫిర్యాదులు నేరుగా స్వీకరించగా.. పరిష్కారంలో తీవ్ర జాప్యంతో పాటు బాధ్యత అంతగా ఉండేది కాదు. ఆన్‌లైన్‌లో వెంటనే నమోదు కావడంతో.. పారదర్శకతతో పాటు మరింత స్పష్టత వస్తోంది. ప్రజావాణిలో తరచూ వచ్చే అర్జీలపై విచారణ చేయాలని భావిస్తున్నారు. కారణాలు గుర్తించి పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ఓ నోడల్‌ అధికారిని కూడా నియమిస్తున్నారు.


అన్ని శాఖల్లో ఈ-ఆఫీస్‌ విధానానికి శ్రీకారం

జిల్లాలోని ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకుగాను.. కాగిత రహిత ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేందుకుగాను ఈ-ఆఫీస్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ విధానం తెస్తుండగా.. ఆన్‌లైన్‌లోనే ఫైళ్లు పంపాలని భావిస్తున్నారు. అధికారుల పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు నివేదికలు తయారు చేయాలని నిర్ణయించారు. వారం వారీగా అధికారుల పనితీరుపై నివేదికలు తీసుకోనున్నారు. దీంతో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వేగంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం వివిధ శాఖల అధికారులు ఫైళ్లను నేరుగా కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లే వారు. ప్రస్తుతం ప్రత్యేకంగా కలెక్టర్‌ పేషీ ఏర్పాటు చేశారు. ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లతో ఈ పేషీ ఏర్పాటు చేయగా.. ప్రతి జిల్లా అధికారి నుంచి వచ్చే ఫైళ్లు ఈ పేషీకి వెళ్తాయి. అక్కడి నుంచి కలెక్టర్‌కు వెళ్లాక.. తిరిగి ఆ పేషీకి వస్తాయి. అవసరం ఉంటే తప్ప, అధికారులతో చర్చించరు. దీంతో అటు అధికారులు, ఇటు కలెక్టర్‌ సమయం వృథా కాకుండా ఉంటుంది. 


అధికారులు, ఉద్యోగుల్లో బాధ్యత పెంపు..!

నిర్దేశించిన సమయంలోగా అధికారులు, సిబ్బంది కార్యాలయాలకు హాజరు కావాలనే ఉద్దేశంతో.. తాను ఉదయం 10గంటలకే కార్యాలయానికి వస్తున్నారు. వివిధ పనులు, సమస్యలతో తనను కలిసేందుకు వచ్చే వారికి ప్రత్యేక వేళలు కేటాయించారు. ప్రతి రోజు సాయంత్రం 4-5గంటల మధ్య గంట పాటు సమయం కేటాయిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసేందుకు నిర్దిష్ట సమయం కేటాయిస్తున్నారు. మిగతా సమయంలో కార్యాలయంలో ఫైళ్ల పరిశీలన, శాఖల వారీగా, పథకాల వారీగా సమావేశాలు, క్షేత్ర పర్యటన చేయాలని నిర్ణయించారు. అన్ని శాఖలు, సెక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. తన చాంబర్‌లోనూ సమూల మార్పులు చేశారు. కలెక్టరేట్‌లో తన చాంబర్‌తో పాటు వివిధ సెక్షన్లలో కర్టయిన్లు తొలగించడంతోనే.. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామనే సంకేతాలిచ్చారు. ఇప్పటికే గ్రామ కార్యదర్శులకు ఐడీ కార్డులు ఇవ్వగా.. త్వరలో గ్రామ పంచాయతీ సర్పంచులకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామాల్లో ట్రాక్టర్ల కొనుగోలు ప్రతిపాదనలు, తీర్మానాలు చేయని.. ఐదుగురు సర్పంచులు, ఇద్దరు ఉపసర్పంచ్‌ల చెక్‌ పవర్‌ రద్దు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదనే సంకేతాలు ఇచ్చారు. 


పల్లె నిద్రతో క్షేత్రస్థాయిలో పర్యటన

క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు స్థానిక ప్రజలతో మమేకం కావాలనే ఉద్దేశంతో కలెక్టర్‌ ప్రత్యేకంగా పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా గిరిజన గ్రామాలను ఎంచుకుని పల్లెబాట పట్టారు. పెంబి మండలం తాటిగూడలో గత బుధవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం ప్రారంభించారు. కలెక్టర్‌తో పాటు ఆయా శాఖల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో ఉంటున్నారు. ముందురోజు రాత్రి గ్రామంలో పల్లెనిద్ర చేసి.. మరుసటి రోజు ఉదయం ఆరు గంటల నుంచి గ్రామంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారాన్ని పరిశీలిస్తున్నారు. పల్లెనిద్ర చేపట్టిన.. తొలిసారి ఆయన పెంబి మండలంలోని మారుమూల తండాలను సందర్శించారు. తాటిగూడ, కొలాంగూడ, పస్పుల, పుల్గంఫాండ్రి, హరిచంద్‌తండా, పెంబి గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తుండడంతో.. గ్రామాల్లో ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు వేగం పెరగనుంది.


logo