హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థుల ఖాతాల్లోనే జమచేయాలన్న కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం విద్యావ్యవస్థకు శాపంగా మారనున్నదా?. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-7 విద్యార్థుల పాలిట శనిలాగా దాపురించనున్నదా? ఈ జీవోతో ఉన్నత విద్యలో అడ్మిషన్లపై ప్రతికూల ప్రభావం పడనున్నదా? అంటే విద్యావేత్తల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు చేరుతారా? సీట్లు నిండుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్పై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అడ్మిషన్లు భారీగా తగ్గే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే అరకొర అడ్మిషన్లతో నెట్టుకొస్తున్న కాలేజీలు పెద్ద సంఖ్యలో మూతబడే ప్రమాదం ఉన్నది. అంతిమంగా యువత చదువులకు దూరమై రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నిరుద్యోగం రాజ్యమేలనున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)దెబ్బకు ఉద్యోగాలు ఊడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఒక వైపు ఐటీ రంగంలో లే ఆఫ్‌ల భయం పట్టి పీడిస్తున్నది. ఇదిలా ఉంటే విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనే చేరుతున్నారు. ఈ మధ్యకాలంలో 18వేల కోర్ ఇంజినీరింగ్ సీట్లు రద్దయ్యాయి. గత ఆరేండ్లలో సీఎస్ఈ సీట్లు, కోర్ కోర్సు సీట్ల సంఖ్య తారుమారయ్యింది. 2019లో సీఎస్ఈ సీట్ల సంఖ్య 22వేలు ఉంటే, 2024కు వచ్చేసరికి కోర్ కోర్సుల్లోని సీట్లు 25వేలయ్యాయి. ఇదే ఆరేండ్లలో సీఎస్ఈ సీట్ల సంఖ్య ఏకంగా 22 వేల నుంచి 61వేలకు పెరిగింది. 2019లో సీఎస్ఈ సీట్లు 34శాతం ఉంటే 2024కు వచ్చేసరికి 72శాతానికి పెరిగాయి. కాలేజీలు కోర్ బ్రాంచీల సీట్లు తగ్గించుకుని, ఆయా సీట్ల స్థానంలో కంప్యూటర్ సైన్స్ సీట్లను పెంచుకుంటున్నాయి.
మన రాష్ర్టానికి చెందిన టాపర్లు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్నారు. 2025-26 విద్యాసంవత్సరంలో ఎప్‌సెట్ టాప్-100 ర్యాంకర్లల్లో కేవలం ముగ్గురు మాత్రమే మన రాష్ట్రంలో అడ్మిషన్ పొందారు. ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ వంటి విద్యాసంస్థల్లో చేరుతున్నారు. మరికొందరు ఎన్ఐటీలను ఆశ్రయిస్తున్నారు. నీట్లో మంచి ర్యాంక్ వచ్చిన వారు ఢిల్లీ ఎయిమ్స్ బాట పడుతున్నారు. టాపర్ల పరిస్థితి ఇలా ఉంటే, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఎఫెక్ట్‌తో సాధారణ విద్యార్థులు అడ్మిషన్లు పొందడం అనుమానంగానే ఉన్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాహక్కును సమాధి చేస్తున్నది. చదువుకునే అవకాశాలను దూరం చేస్తున్నది. మరో వైపు పరోక్షంగా స్విగ్గీ, జొమాటో డైలివరీ, క్యాటరింగ్ బాయ్స్‌ను తయారుచేస్తున్నది. ర్యాపిడో డ్రైవర్లుగా మలుస్తున్నది. ఉన్నత చదువులు చదివి డాక్టరో, ఇంజినీరో, సాఫ్ట్‌వేరో అవుదామనుకున్న యువత ఆశలను సర్కార్ నిర్వీర్యం చేస్తున్నది. సర్కార్ ఒక వైపు గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. మరో వైపు విద్యార్థులే ఫీజులు కట్టుకోవాలంటూ ఫీజుల పథకానికి చరమగీతం పాడుతున్నది. గొప్పలు చెప్పి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇప్పటి వరకు వెయ్యి మందికే శిక్షణ ఇచ్చారు. అది కూడా డిప్లొమా కోర్సులకే.
కాంగ్రెస్ సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తుండటంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. గతంలో కేసీఆర్ యాదవులకు గొర్లు, బర్లు ఇస్తే రేవంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంజినీర్లు, డాక్టర్లు కావాల్సినవారు గొర్లు, బర్లు కాసుకోవాల్నా? అంటూ అప్పట్లో ప్రశ్నించారు. మరిప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సర్కార్ ఉరితాడు బిగిస్తే విద్యార్థులు బర్లు, గొర్లు కాసుకోవాల్నా? అంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతోనే విద్యార్థులు కాలేజీల్లో చేరారని, విద్యార్థులే ఫీజులు కట్టుకోవాలంటే ప్రభుత్వంపై చీటింగ్ కేసు పెట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం 58 శాతం సీట్లు మాత్రమే నిండాయి. అంటే ఏకంగా 42శాతం సీట్లు నిండలేదన్నమాట. ఎప్‌సెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, సీపీగెట్ సహా మొత్తం ఏడు రకాల కోర్సుల్లో సీట్లు నిండని పరిస్థితి. అన్ని కోర్సులు కలిపితే 2,79, 238 సీట్లుండగా, 2025-26 విద్యాసంవత్సరంలో 1,62,479 కన్వీనర్ కోటా సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏకంగా 1,16,759 సీట్లు నిండలేదు. ఏ కోర్సు తీసుకున్నా 70 శాతం సీట్లు నిండని పరిస్థితులున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతోనే మొత్తం సీట్లు నిండటం లేదు. ఇక ఫీజులు ఇవ్వకపోతే సీట్లు నిండేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
