హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ‘నిజంగానే హిట్లర్ నీకు ఆదర్శం. హైడ్రా నువ్వు ఎకుపెట్టిన కిరాతక ఆయుధం. కూల్చివేతలే నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సాగిస్తున్న రాక్షస ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక చీకటి కాలమని విమర్శించారు. తెలంగాణ సమాజంలో రేవంత్ సర్కార్‌పై ఉన్న ఆక్రోశాన్ని, ప్రజల గొంతుకను వినిపిస్తూ సీఎంకు అంకితం ఇస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘యాది ఉంచుకో రేవంత్‌రెడ్డీ.. నీ ఆరాధ్య దైవమైన హిట్లర్‌కు ఘోర ఓటమి తప్పలేదు. ప్రజల ఆగ్రహ జ్వాలల్లో ఆ నియంత చరిత్రలో కలిసిపోక తప్పలేదు. తెలంగాణ అనేది పోరాటాల పురిటిగడ్డ. ఇకడి బిడ్డల ఉద్యమాల ఉప్పెన ముందు ఏ నియంతృత్వమైనా తలవంచక తప్పదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ముందు నీ అహంకారం, అధికారం కొట్టుకుపోవడం ఖాయం’ అని ఆయన హెచ్చరించారు.