Urea No Stock | ఇంకా యాసంగి ధాన్యం కల్లాల్లోనే ఉన్నది. మరోవైపు వానకాలం సాగు మొదలైంది. దానితోపాటే ఎరువుల లొల్లి మళ్లీ షురువైంది. కాంగ్రెస్ పాలనలో ఈసారి కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పేలా లేవు. సీజన్ ప్రారంభమై ఎరువులు కొనేందుకు రైతులు దుకాణాల వద్ద మళ్లీ క్యూ కడుతుంటే ‘అన్నిచోట్లా ‘నో స్టాక్’ బోర్డులే కనిపిస్తున్నాయి. దేశానికే ఆదర్శంగా నిలిచిందని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకొన్న యూరియా యాప్.. గప్‌చుప్ అయిపోగా దానికితోడు కేంద్ర ప్రభుత్వం కూడా మరో యాప్ తెస్తున్నది.
హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ): రైతులను యూరియా కొరత వెంటాడుతున్న ది. ఈ వానకాలం సాగుకు కూడా యూరియా తిప్పలు తప్పేలా లేవు. యూరియాకు తోడు డీఏపీ కొరత కూడా రైతులను ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఏర్పడింది. మార్క్‌ఫెడ్ వద్ద ఉన్న యూరియా, డీఏపీ నిల్వలను గమనిస్తే వానకాలంలో ఎరువుల కష్టాలు కండ్ల ముం దు కనిపిస్తున్నాయి. సీజన్‌కు ముందు ఒక్క మార్క్‌ఫెడ్ వద్దనే నాలుగు లక్షల టన్నుల యూరియా బఫర్‌స్టాక్ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 2.2 లక్షల టన్నులు మాత్ర మే ఉన్నదని తెలిసింది.
ఇప్పటికే సీజన్ ప్రారంభమైంది. రైతులు క్రమంగా యూరియా కొనుగోలు ప్రారంభించారు. కానీ రైతులకు అన్నిచోట్లా స్టాక్ దొరుకడంలేదు. నిరుడు మే, జూన్ నెలల్లో కలిపి రైతులు 1.8 లక్షల టన్ను ల యూరియా కొనుగోలు చేశారు. జూలైలో 3.43 లక్షల టన్నుల యూరియా కొనుగోలు చేశారు. ఈ మూడు నెలల్లో కలిపి 5.23 లక్షల టన్నులు అవసరం. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద కేవలం 2.2 లక్షల టన్నులు మాత్రమే ఉండ టం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో పంటల సాగు జోరందుకునే సమయంలో యూరియా కొరత తప్పదనే ఆందోళనను అధికారులు సైతం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం నుంచి ఈ నెలలో రావాల్సిన రెండు లక్షల ట న్నుల యూరియా వస్తేనే గండం నుంచి బయటపడుతామని, లేకపోతే మరోసారి రైతులు యూరియా కోసం యుద్ధం తప్పదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తంచేస్తున్నారు.
మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుగా ఇప్పటికే యూరియా కొరతతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులపై ఎరువుల కంపెనీలు ధరల పిడుగు వేశాయి. రైతులు యూరియా తర్వాత అధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువుల ధరలను భారీగా పెంచాయి. ముఖ్యంగా రైతులు అధికంగా ఉపయోగించే 20-20 కాంప్లెక్స్ బస్తా ధరను రూ.1,400 నుంచి రూ. 1,800కు పెంచాయి. ఇది ఇంకా పెరిగి రూ.2150కి చేరుకొనే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. పొటాష్ ఎరువుల ధర రూ.1,800 నుంచి రూ.1,975కి పెరిగింది. 10-26-26 ధర రూ.1,200 నుంచి రూ.1,700కు పెరిగింది. ఇక 16-16-16 ధర రూ.1,675 నుంచి రూ.2,050కి పెరిగింది. దీంతో రైతులు కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుకు జంకుతున్నారు.
కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరుగడంతో రైతులు ప్రత్యామ్నాయంగా డీఏపీ కోసం పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం డీఏపీ బస్తా ధర రూ.1,350గా ఉన్నది. అయితే యూరియాతోపాటు డీఏపీ కొరత వెక్కిరిస్తున్నది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద డీఏపీ 10 వేల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నదని తెలిసింది. నిరుడు జూన్‌లో 71వేల టన్నులు, జూలైలో 82వేల టన్నుల డీఏపీని రైతులు కొనుగోలు చేశారు. కానీ, ప్రస్తుతం ఆ మేరకు నిల్వలు లేకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నది. డీపీఏ లభించని పక్షంలో పెరిగిన ధరలను భరిస్తూ కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయక తప్పదని, పెట్టుబడి భారం పెంచుకోక తప్పదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటికే యూరియా యాప్‌ను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూరియా కోసం రైతులు గుమిగూడకుండా, కొరత ఉన్న విషయం బహిర్గతం కాకుండా యాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరో యాప్ తీసుకొస్తున్నది. ఫెర్టిలైజర్ సేల్స్ అప్లికేషన్ సిస్టం (ఎఫ్ఎస్ఏఎస్) యాప్‌ను అమల్లోకి తీసుకొస్తున్నది. తొలిదశలో రాష్ట్రంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ కేవలం యూరియాకే పరిమితం కాగా, కేంద్రం తీసుకొచ్చిన యాప్ అన్ని ఎరువులకు ఉద్దేశించినది. దీంతో రైతులకు మరిన్ని కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వర్షకాలం ప్రారంభమైనందున ప్రభుత్వం డీఏపీ, యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట మాధపూర్, గేర్జం, ముక్రా(బీ) రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నేడు, రేపు మాపంటూ అధికారులు తమ చుట్టూ తిప్పుకొంటున్నారని ఆరోపించారు. ఇటు వ్యవసాయ పనులు చేయాలా? లేక కార్యాలయాల చుట్టూ యూరియా, డీఏపీ కోసం తిరగాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం యూ రియా, డీఏపీతోపాటు రైతుభరోసా నిధులు విడుదల చేయాలని కోరారు.

ఎరువుల కోసం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి సొసైటీ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు