“యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణపై కక్ష గట్టింది. అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉత్తరాదికో నీతి, దక్షిణాదికో నీతి అవలంబిస్తున్నది. ఇది వ్యవసాయ మనుగడకు, రైతాంగానికి, బడుగు, బలహీనవర్గాలకు, లక్షలాది మంది ఉపాధికి సంబంధించిన జీవన్మరణ సమస్య. రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగించాలి. ఎందాకైనా కొట్లాడాలి. వడ్లు కొనేంత వరకూ తెలంగాణ మాదిరి ఉద్యమం చేయాలి” అని , జడ్పీ చైర్మన్లు టీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు. యాసంగి వడ్లు కొనాలనే విషయంపై సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం సన్నాహక సమావేశాలు నిర్వహించారు. నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గ సమావేశాల్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర మంత్రులు సునాయసంగా అబద్ధాలు ఆడే విషయాలు, స్థానిక బీజేపీ లీడర్లు అవలంబిస్తున్న విధానం, రాష్ట్రంపై మోదీకి ఉన్న సవితి ప్రేమను విపులంగా విశదీకరించారు. కేంద్రం దిగొచ్చే వరకు నిరసనలు నిర్వహించి, ఈ నెల 31 వరకు పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌లు తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపాలని సూచించారు.
ఖానాపూర్ టౌన్, మార్చి 24: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనేదాకా కేంద్రంపై ఉద్యమిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్పస్టం చేశారు. ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్హాల్లో ఏడు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కేంద్రం తీసుకుంటున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు రోజులపాటు చేపట్టబోయే కార్యక్రమాలను మండల నాయకులకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ర్టానికి కేంద్రం అన్యాయం చేస్తున్నదన్నారు. గుజరాత్లో ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొని, తెలంగాణలో ఎందుకు కొనరని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేయాలనే బీజేపీ కుట్రలను తిప్పకొడుదామని పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి 31 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకుల తీరును ప్రజల్లో ఎండగట్టాలని, రైతాంగానికి మద్దతుగా సీఎం కేసీఆర్ చేపట్టిన పోరుబాటలో అందరూ కలిసిరావాలని కోరారు. తెలంగాణ పచ్చబడుతుంటే చూడలేకే, ఢిల్లీ నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీనికి రాష్ట్ర బీజేపీ నాయకులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తామంటే, టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు. కేంద్రం దిగివచ్చే వరకూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆందోళనలు చేపట్టేందుకు శ్రేణులంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, ఎంపీపీ మొయిద్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, ఏఎంసీ చైర్మన్ శంకర్, వైస్ చైర్మన్ గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్లు సత్యనారయణ, శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, డీసీసీబీ చైర్మన్, డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, రైతు బంధు సమితి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.