మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)వేలంలో తెలుగు క్రికెటర్లు సత్తాచాటారు. రానున్న సీజన్ కోసం ఢిల్లీలో జరిగిన వేలంలో అదిరిపోయే ధర సొంతం చేసుకున్నారు. గతానికి భిన్నంగా ఈసారి మన తెలంగాణ నుంచి నలుగురు క్రికెటర్లు వేర్వేరు ఫ్రాంచైజీల్లో చోటు దక్కించుకున్నారు. ఇటీవల వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమ్ఇండియాలో సభ్యురాలైన హైదరాబాదీ అరుంధతిరెడ్డిని ఆర్సీబీ 75 లక్షలకు తీసుకోగా, జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న త్రిష(యూపీ), క్రాంతిరెడ్డి (ముంబై), మమత(ఢిల్లీ ) పది లక్షల చొప్పున వేర్వేరు ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి.
ఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ కోసం గురువారం ఢిల్లీలో నిర్వహించిన మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఆల్రౌండర్లపై కాసుల వర్షం కురిపించాయి. ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత విజయంలో కీలకపాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన ఆగ్రా అమ్మాయి దీప్తి శర్మకు రికార్డు ధర దక్కింది. రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీప్తిని యూపీ వారియర్స్.. రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ద్వారా ఏకంగా రూ. 3.2 కోట్లు వెచ్చించి మళ్లీ సొంతం చేసుకుంది.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక ధర. కివీస్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్లతో దక్కించుకుంది. ఎవరూ ఊహించని విధంగా భారత వెటరన్ క్రికెటర్ శిఖా పాండేకు వేలంలో అనూహ్య ధర దక్కింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండంలో పుట్టి పెరిగిన శిఖా.. భారత జట్టులో చోటు కోల్పోయి చాలాకాలమైనా వేలంలో ఆమె కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. తనదైన పేస్‌తో పాటు లోయరార్డర్లో ఉపయుక్తమైన బ్యాటర్‌గా పేరున్న ఆమె.. రూ. 40 లక్షలతో వేలంలోకి వచ్చి ఏకంగా రూ. 2.4 కోట్లు కొల్లగొట్టడం గమనార్హం. శిఖా కోసం బెంగళూరు చివరిదాకా యత్నించినా చివరికి యూపీ ఆమెను తమ జట్టులో చేర్చుకుంది.
డబ్ల్యూపీఎల్ వేలంలో మన తెలుగు క్రికెటర్లు ఆకట్టుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న అరుంధతిరెడ్డి, గొంగడి త్రిష, నల్లరెడ్డి క్రాంతిరెడ్డి, మడివాల మమత, శ్రీచరణి ప్రతిభకు తగిన రీతిలో న్యాయం జరిగింది. ముఖ్యంగా ఇటీవలి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలకంగా వ్యవహరించిన శ్రీచరణి 1.3 కోట్లతో జాక్‌పాట్ కొట్టింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంలో ముందుండే శ్రీచరణి 30 లక్షల కనీస ధరతో వేలంలోకి ప్రవేశించింది. ఈ యువ స్పిన్నర్ కోసం తొలుత ఢిల్లీ, ముంబై, యూపీ పోటీపడ్డాయి. అయితే చివరికి ఢిల్లీ సొంతం చేసుకుంది.
గత మూడు సీజన్లు ఢిల్లీకి ఆడిన హైదరాబాదీ స్పీడ్‌స్టర్ అరుంధతిరెడ్డిని ఈసారి ఆర్సీబీ రూ.75లక్షలకు తీసుకుంది. 30 లక్షలతో ఢిల్లీ మొదట అరుంధతిని తిరిగి తీసుకునేందుకు ఆసక్తి కనబర్చగా, ఆ తర్వాత ఆర్సీబీ పోటీలోకి రాగా గుజరాత్ జెయింట్స్ మూడో టీమ్‌గా వచ్చింది. దీంతో ధర 75లక్షలకు చేరుకోగా, గుజరాత్ పోటీ నుంచి తప్పుకోగా ఆర్సీబీ..అరుంధతిని తీసుకుంది.
తన స్నేహితులైన మందన, రాధాయాదవ్తో కలిసి వచ్చే సీజన్లో అరుంధతి..ఆర్సీబీకి ఆడనుంది. ఇక రెండు సార్లు అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమ్‌లో సభ్యురాలైన భద్రాచలం అమ్మాయి త్రిషను ఈసారి అదృష్టం వరించింది. గత సీజన్లలో నిరాశకు గురైన త్రిషను ఈసారి యూపీ వారియర్స్ కనీస ధర 10 లక్షలకు తీసుకుంది. పేస్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న కాంత్రిరెడ్డి, వికెట్‌కీపర్, బ్యాటర్‌గా నిలకడ ప్రదర్శిస్తున్న మమత తొలిసారి డబ్ల్యూపీఎల్‌లో అవకాశం దక్కించుకున్నారు.

వేలంలో మొత్తంగా 73 స్థానాల కోసం 276 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదుచేసుకోగా పలువురు స్టార్ ఆటగాళ్లను పక్కనబెట్టిన ఫ్రాంచైజీలు.. వన్డే వరల్డ్ కప్‌లో మెరిసిన ఆటగాళ్లపై భారీగా వెచ్చించాయి. 73 స్థానాలకు గాను 67 మంది క్రికెటర్లను వేలంలో ఆయా జట్లు దక్కించుకున్నాయి. రూ. 41.10 కోట్లతో వేలంలోకి వచ్చిన ఐదు ఫ్రాంచైజీలు.. ముగిసేసరికి రూ. 40.08 కోట్లు ఖర్చు చేశాయి.
గత మూడు సీజన్ల పాటు యూపీ వారియర్స్‌కు ఆడిన దీప్తిని ఈ సీజన్‌కు ముందు ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్.. రూ. 50 లక్షలకు ఆమెను దక్కించుకునేందుకు సిద్ధమైంది. కానీ అనూహ్యంగా యూపీ.. ఆమెను ఆర్టీఎం ద్వారా తీసుకోవాలని భావించింది. ఇదే సమయంలో ఢిల్లీ.. ఆమె ధరను రూ. 3.2 కోట్లకు పెంచింది. అయినా యూపీ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకోవడంతో విస్తుపోవడం క్యాపిటల్స్ వంతైంది.
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి మొదలుకానుంది. డబ్ల్యూపీఎల్ చైర్పర్సన్ జయేశ్ జార్జ్.. వేలం ప్రక్రియ సందర్భంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 దాకా జరుగబోయే నాలుగో సీజన్‌ను నవీ ముంబై, వడోదరలో ఆడించనున్నట్టు ఆయన చెప్పారు. ఫిబ్రవరిలో భారత్ పురుషుల ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో డబ్ల్యూపీఎల్‌ను ముందుగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
