ముంబై: స్వదేశంలో రెండు వైట్‌వాష్‌లను ఎదుర్కుని తీవ్ర విమర్శల పాలవుతున్న టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ విషయంలో బీసీసీఐ తక్షణ నిర్ణయాలేమీ తీసుకోవాలని అనుకోవడం లేదు. ప్రస్తుతం జట్టు సీనియర్ల సేవలను కోల్పోయి పరివర్తన దశలో ఉన్న నేపథ్యంలో అలాంటి సాహాసాలేమీ చేయబోదని బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో గంభీర్‌ను మార్చాలని మేం (బీసీసీఐ) భావించడం లేదు. అతడు జట్టును పునర్నిర్మిస్తున్నాడు. గౌతీ కాంట్రాక్టు 2027 వరల్డ్ కప్ దాకా ఉంది. దక్షిణాఫ్రికా సిరీస్ ముగిశాక జట్టు మేనేజ్మెంట్, సెలెక్టర్లతో సమావేశం ఉంటుంది’ అని తెలిపాడు.
ఇదిలాఉండగా భారత జట్టు ప్రదర్శనపై ఇంటాబయటా విమర్శలను ఎదుర్కుంటున్న గౌతీకి దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచారు. జట్టులో కోచ్ పాత్ర చాలా పరిమితమని..మైదానంలో ఆడాల్సింది ఆటగాళ్లే అని, వాళ్లు విఫలమైతే గంభీర్‌ను టార్గెట్ చేయడం తగదన్నారు.