బెంగళూరు, నవంబర్ 27 : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే ఈ ఎక్స్ఈవీ 9ఎస్ ఎస్యూవీ మాడల్ ప్రారంభ ధర రూ.19.95 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.29.45 లక్షలుగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, అలాగే కస్టమర్లు కోరుకుంటున్న విధంగా ఈ నూతన మాడల్‌ను తీర్చిదిద్దినట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ బిజినెస్ ప్రెసిడెంట్ ఆర్ వేలుసామి తెలిపారు. ఆరు రకాల్లో లభించనున్న ఈ కారు జనవరి 14, 2026 నుంచి బుకింగ్‌లు చేసుకోవచ్చునని, అదే నెల చివరి నుంచి కొనుగోలుదారులకు అందచేయనున్నట్టు ఆయన వెల్లడించారు.