గట్టు, నవంబర్ 27 : మండలంలోని గొర్లఖాన్‌దొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం వేశారు. దీనికి ఆ గ్రామంలోని రైతువేదిక వేదికైంది. నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించడం చర్చనీయాంశమైంది. రైతువేదికలో గ్రామపెద్దల సమక్షంలో వేలంపాటను నిర్వహించారు. కాగా వేలంపాటలో నేష శ్రీనివాసులు చివరగా రూ.57లక్షలకు పాట పాడగా అతనే సర్పంచ్ అని గ్రామ పెద్దలు తీర్మానించారు. కాగా ఈ వేలం విషయం ఆనోటా ఈనోటా వెళ్లి అతడి భార్యకు తెలిసింది. ఈ వేలంకు తన భర్త ఒప్పుకునేటట్లయితే తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని రైతు వేదిక వద్దకు వెళ్లి తేల్చిచెప్పడంతో శ్రీనివాసులు వేలంపాట నుంచి తాను తప్పుకుంటున్నట్లు గ్రామ పెద్దలకు చెప్పారు.
ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఉప్పరి ఆంజనేయులు ఇదే నగదును తాను చెల్లిస్తానని చెప్పడంతో సర్పంచ్ పదవి అతడికి అప్పచెప్పనున్నట్లు గ్రామపెద్దలు తీర్మానం చేశారు. కాగా మాజీ ఉప సర్పంచ్ ఇమాంవలీతోపాటు మరి కొంతమంది కూడా పాల్గొన్నట్లు గ్రామస్తులు చెప్పారు. కాగా వేలంపాటలో వచ్చిన నగదును గ్రామాభివృద్ధికి వెచ్చించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా ఈ వేలంపాట జోగుళాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశమైంది. కేటీదొడ్డి మండలంలోని చింతలకుంటలోక సర్పంచ్‌గా రాజశేఖర్‌ను ఏకగ్రీంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని ఆయన ఒప్పుకోవడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఇదిలావుండగా గట్టు మండలంలోని అరగిద్దలో కూడా సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించనున్నారని సమాచారం ఉన్నది.