గువహటి: దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి తర్వాత భారత తాత్కాలిక సారథి రిషభ్ పంత్ టీమ్ఇండియా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. గత రెండు వారాల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని, ఆటగాళ్లుగానే గాక జట్టుగానూ విఫలమయ్యామని తెలిపాడు. సిరీస్ ఓటమి తర్వాత అతడు తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఓ లేఖను విడుదల చేస్తూ.. ‘గత రెండు వారాల్లో మేం నాణ్యమైన క్రికెట్ ఆడలేదని చెప్పడంలో ఎలాంటి భేషజాల్లేవు. వ్యక్తిగతంగానే గాక జట్టుగా మేం ఉన్నత స్థాయిలో ఆడి కోట్లాది అభిమానుల మోముల్లో సంతోషాన్ని చూడాలని ఎప్పుడూ కోరుకుంటాం. కానీ ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయాం. అందుకు మమ్మల్ని క్షమించండి. మళ్లీ మేం బలంగా పుంజుకుంటాం’ అని లేఖలో రాసుకొచ్చాడు.