గద్వాల, నవంబర్ 27 : అంగట్లో సరుకుల మాదిరిగా గద్వాల నియోజకవర్గంలో సర్పంచ్ పదవులకు వేలం పాట నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహశ్యం చేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధిని పక్కకు పెట్టి సర్పంచ్ పదవికి ఎవరు ఎక్కువ వేలం పాడతారో వారికే పదవుల పట్టం కడుతున్నారు. వేలం పాటను అడ్డుకోవాల్సిన ప్రధాన పార్టీలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో పదవుల వేలం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఒక నేత చదువుకున్న యువత రాజకీయ మార్పు కోసం ఓటు వేయండి, ఏకగ్రీవం పేరుతో నాయకుల గ్రామ దోపిడీని అడ్డుకోండి అని ప్రగల్బాలు పలికిన ఆ నేత ఊరిలోనే సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించడం కొసమెరుపు. ఆ నాయకుడు మాటలు తప్పా చేతల్లో ఏమి చేయలేక పోయాడని చెప్పడానికి ఈ ఏకగ్రీవమే నిదర్శనమని ప్రజలు గుసగుస లాడుతున్నారు.
వేలం పాట ద్వారా పదవులు దక్కించుకున్న నాయకులు ఇక గ్రామాలను అభివృద్ధి ఏమి చేస్తారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడి, గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రధాన పార్టీ నాయకులు, గ్రామస్తులతో సమావేశా లు నిర్వహించి సర్పంచులను ఏకగ్రీవం చేసేందుకు ఏకంగా వేలం పాట నిర్వహించడం గద్వాల నియోజకవర్గంలో చర్చనీయాంశగా మారింది. గద్వాల నియోజకవర్గంలోని గట్టు, కేటీదొడ్డి, గద్వాల మండలంలో ఒక్కో గ్రామపంచాయతీని వేలం పాట ద్వా రా సర్పంచ్ అభ్యర్థులు ఎంపికయ్యారు. గట్టు మం డలం గొర్లఖాన్‌దొడ్డి పంచాయతీ స్థానానికి వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన వ్యక్తి రూ.57 లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్నాడు.
అడ్వాన్సుగా రూ.5లక్షలు ఇచ్చి బాండ్ పేపర్ రాసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా కేటీదొడ్డి మండలం చింతలకుంట సర్పంచ్ స్థానాన్ని రూ. 38.50లక్షలకు వ్యక్తి వేలం ద్వారా దక్కించుకున్నట్లు తెలిసింది. గద్వాల మండలం కొండపల్లిలో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా చివరకు రూ.60 లక్షల కు సర్పంచ్‌గా ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. పేరుకు మాత్రమే ఏకగ్రీవమని మూడు సర్పంచుల స్థానాలను వేలం ద్వారా దక్కించుకున్నట్లు తెలిసింది. ఏకగ్రీవం చేస్తే సర్పంచ్ అభ్యర్థులు ఎందు కు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు.